ఈ సారి లోక్‌సభ ఎన్నికల ‘ఓటింగ్ కాలం’ 44 రోజుల పాటు కొనసాగనుంది. తొలి పార్లమెంటు ఎన్నికల (1951-52) తర్వాత ఇదే సుదీర్ఘ కాలావధి! నాటి ఎన్నికలలో ఈ గడువు నాలుగు నెలలకు పైనే! ఈ సారి మొదటి దశ పోలింగ్ 19న, చివరిది జూన్ 1న జరగనున్నాయి. ఈ రెండు తేదీల మధ్య 44 రోజుల గడువు ఉంది. అదే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన శనివారం నుంచి ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4 వరకు లెక్కిస్తే 82 రోజులు! ఎన్నికల క్రతువు ఇన్ని రోజుల పాటు కొనసాగడానికి కారణం ఏమిటన్న విలేకరుల ప్రశ్నకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బదులిస్తూ ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, సెలవులు, పండుగలు, పరీక్షల వంటి ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ తేదీలను నిర్ణయించడమేనని తెలిపారు. 1980లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అతి తక్కువగా నాలుగు రోజుల్లోనే పూర్తయింది.