రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగే ఎన్నికల ప్రక్రియ వివరాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, సహచర కమిషనర్లతో కలిసి వెల్లడించారు. మొత్తం ఏడు దశల్లో సాగే ఈ ఎన్నికల్లో దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్, ఒడిసా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని మొత్తం శాసనసభ స్థానాలకు, వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 26 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తొలివిడత పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. కీలకమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన మే 13న(సోమవారం) నాలుగో దశలో జరగనున్నాయి. అదే రోజు తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరగనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కూడా నాలుగో దశ పోలింగ్‌లో భాగంగానే జరుగుతుంది. జూన్ 1న తుది ఏడో విడత పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. జూన్ 16న ప్రస్తుత లోక్‌సభ కాలం పూర్తవుతున్నందువల్ల ఆ లోపే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. మణిపూర్‌లో కల్లోలం దృష్యా వివిధ శరణార్థుల శిబిరాల్లో ఉన్న వారికి కూడా ఓటు సౌకర్యం కల్పించాలని కమిషన్ నిర్ణయించింది. ఇక్కడ రెండు లోక్‌సభ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కశ్మీర్ నుంచి వలస వెళ్లిన వారికి కూడా వారు ఎక్కడున్నా అక్కడి నుంచే ఓటు సౌకర్యం కల్పిస్తారు. శనివారం మధ్యాహ్నం నుంచే దేశ వ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. విలేకరుల సమావేశంలో కొద్ది రోజుల క్రితం నియమితులైన నూతన కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.