ఏపీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించే పనిలో పడ్డాయి. అధికార వైసీపీ ఏకంగా 175 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. కేవలం అనకాపల్లి పార్లమెంట్ సీటుకు మాత్రమే ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇక టీడీపీ సైతం 128 ఎమ్మెల్యే సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఎంపీ అభ్యర్థులను ఇంకా వెల్లడించలేదు. జనసేన సైతం పొత్తులో భాగంగా తమకు వచ్చిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే అధికారికంగా మాత్రం ఏడుస్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేసింది. మార్చి 25వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం.
వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత హస్తం పార్టీలో కొత్త జోష్ వచ్చిందని చెప్పొచ్చు. దీంతో అంతకుముందు ఎన్నికల సమయంలో పోటీకే ముందుకు రాని నేతలు.. ఈసారి హస్తం గుర్తుపై పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. వందల సంఖ్యలనే దరఖాస్తులు కూడా వచ్చాయి. దీంతో వీరందరికీ విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు షర్మిల. ఒక్కో లీడర్‌ను ముఖాముఖిగా ఇంటర్వ్యూ చేసి గెలుపు అవకాశాలు ఉన్నాయనే వ్యక్తుల పేర్లతో ఒక జాబితాను రెడీ చేశారు. ఈ జాబితాను ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానానికి చేరవేయగా.. మార్చి 25న అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు.
ఇక కాంగ్రెస్ తరుఫున వైఎస్ షర్మిల ఎక్కడ పోటీ చేస్తారనే దానిపై ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ తరుఫున వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి పేరును వైసీపీ అధికారికంగా ప్రకటించింది. అయితే కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు సూచించినట్లు తెలిసింది. అధిష్ఠానం ఆదేశాలకు షర్మిల సైతం అంగీకరించినట్లు సమాచారం. సొంత జిల్లా కావటంతో విజయావకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో షర్మిల ఇక్కడ పోటీ చేయడానికి అంగీకరించినట్లు తెలిసింది.
హైకమాండ్ ఆదేశాలను పాటించి షర్మిల.. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో నిలిస్తే.. సోదరుడు అవినాష్ రెడ్డికే ప్రత్యర్థిగా తలపడాల్సి ఉంటుంది. కడప ఎంపీ సీటుకు షర్మిల పోటీచేస్తారనే వార్తలతో కడప పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మరి కాంగ్రెస్ అధిష్టానం కడప లోక్‌సభ స్థానం నుంచే షర్మిలను బరిలోకి దింపుతుందా.. పోటీకి దిగితే అవినాష్ రెడ్డిపై షర్మిల ఏరకంగా ప్రచారం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి మీద.. వివేకా కూతురు సునీత, వైఎస్ షర్మిల పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పోటీకి దిగితే ఇక ఇదే అంశాన్ని తెరపైకి తెస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి.