దేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరు నగరంలోని నీటి సంక్షోభం యావత్తు దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రోజువారీ అవసరాలకు సరిపడా నీరు దొరక్క తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నీటి వినియోగంపై ఆంక్షలు విధించిన అధికారులు.. పొదుపు సూత్రాన్ని అనుసరించాలని పౌరులకు పదేపదే సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నీటి కష్టాలు ఉద్యాననగరి నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహా నగరానికి తాకాయి. మంగళవారం నాటి తాగునీరు సరఫరాలో 15 శాతం కోత ఉంటుందని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఒక ప్రకటనలో వెల్లడించింది.
థానే జిల్లాలోనిపైస్ డ్యామ్‌లో తగినంత నీటిమట్టం లేదని, అందుకోసమే నీటి కోత విధించాల్సి వస్తోందని బీఎంసీ అధికారులు తెలిపారు. దీనికి తోడు 5 శాతం కోత అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ‘పైస్ డ్యామ్‌కు ఉన్న 32 గేట్లలో ఒక గేట్ రబ్బర్ బ్లాడర్ డిసెంబర్ నెలలో పనిచేయలేదు.. డిసెంబరు 16 నుంచి లీకేజ్ ఉంది.. దీంతో జలాశయం నుంచి నుంచి నీరు వృథగా బయటకుపోయింది. బ్లాడర్‌ను సరి చేయడానికి నీటి మట్టాన్ని 31 మీటర్లకు తగ్గించి, ఆ నీటిని భట్సా రిజర్వాయర్‌కు తరలించాం... మరమ్మతులు పూర్తిచేసి రబ్బర్ బ్లాడర్ సరి చేశాం.. కానీ, పంజర్ పోల్ వద్దగల ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా ముంబయికి పంపింగ్ చేయడం సరిపడా నీటిమట్టం లేదు..
గతంలో తరలించిన నీరు 48 కి.మీ దూరంలోని భట్సా రిజర్వాయర్‌లోనే ఉండిపోయింది.. ఆ నీరు చేరుకోవడానికి, తగిన స్థాయికి తీసుకురావడానికి సమయం పడుతుందని భావిస్తున్నాం’ అని పేర్కొంది.. ఇదే సమయంలో ఆసియాలో పెద్దదైన భాండప్ వాటర్ ప్లాంట్‌ను శుభ్రం చేయాల్సి ఉంది. అందు కోసం 5 శాతం నీటి కోతను విధిస్తామని బీఎంసీ ఇదివరకే వెల్లడించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు ఈ కోత ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవానికి 10 శాతం నీటి కోత విధించాలని బీఎంసీ ప్రతిపాదన చేయగా.. అవసరమైన నీటిని రిజర్వాయర్ల నుంచి మళ్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.