దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలె షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 7 విడతల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు 4 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 వ తేదీన తొలి విడత పోలింగ్ మొదలు కానుండగా.. జూన్ 1 వ తేదీన చివరి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు మార్చాలని కాంగ్రెస్, ముస్లిం సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు కూడా రాశాయి. అయితే ఏప్రిల్ 26 వ తేదీన జరగనున్న రెండో విడత ఎన్నికల తేదీలను మార్చాలని ఈ విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
ఏప్రిల్ 26 వ తేదీ శుక్రవారం కావడంతో ఆరోజు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముస్లింలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల తేదీని మార్చాలని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎంఎం హాసన్, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీషన్.. ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో కోరారు. కేరళతోపాటు తమిళనాడులో కూడా ఈ పోలింగ్ తేదీలను మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్-ఐయూఎంఎల్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.
శుక్రవారం కావడంతో ముస్లిం ఓటర్లతోపాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే ముస్లిం అధికారులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి కేరళ నేతలు, ముస్లిం నేతలు మెయిల్స్ పంపించారు. దీంతో ఏప్రిల్ 26 వ తేదీన ఉన్న రెండో విడత ఎన్నికలను కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మార్చాలని కోరుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల తేదీలు మార్చుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.
సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 వ తేదీన ప్రారంభమై మొత్తం 7 విడతల్లో జూన్ 1 వ తేదీన ముగియనున్నారు. ఆ తర్వాత జూన్ 4 వ తేదీన కౌంటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెలువరించనున్నారు. ఏప్రిల్ 26 వ తేదీన 2 వ విడత పోలింగ్, మే 7 వ తేదీన మూడో దశ పోలింగ్, మే 13 వ తేదీన నాలుగో విడత పోలింగ్, మే 20 వ తేదీన ఐదో దశ పోలింగ్, మే 25 వ తేదీన ఆరో దశ పోలింగ్, చివరిగా జూన్ 1 వ తేదీన ఏడో దశ పోలింగ్ జరగనుంది. లోక్‌సభలో ఉన్న 543 స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు.. మిగిలిన రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఉపఎన్నికలకు పోలింగ్ జరగనుంది.