ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌కి చెందిన పతంజలి సంస్థ వ్యాపార ప్రకటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంటూ బాబా రాందేవ్‌కు షోకాజ్ నోటీసులు జారీచేసింది. న్యాయస్థానం ముందు విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. పతంజలి ఆయుర్వేదం, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణన్ ధిక్కార చర్యలపై అఫిడివిట్ దాఖలు చేయనందుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. యోగా గురువు రాందేవ్, బాలకృష్ణన్‌లు తమ ముందు హాజరుకావాలని, కంపెనీ ఉత్పత్తుల ప్రకటనలు, వాటి ఔషధ ప్రభావానికి సంబంధించిన ధిక్కార చర్యలపై స్పందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వ్యాక్సినేషన్ డ్రైవ్, ఆధునిక ఔషధాలకు వ్యతిరేకంగా రామ్‌దేవ్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పతంజలి వ్యవస్థాపకుడిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నవంబర్ 2023లో పతంజలి ఆయుర్వేద్ తన ప్రకటనలలో ‘తప్పుడు’ వాదనలు చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అటువంటి పద్ధతులను ఆశ్రయించినందుకు ఆ సంస్థకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
‘పతంజలి ఆయుర్వేదం అన్ని తప్పుడు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు తక్షణమే నిలిపివేయాలి.. ఈ కోర్టు అటువంటి ఉల్లంఘనలను చాలా తీవ్రంగా పరిగణిస్తుంది.. ఒక నిర్దిష్టమైన వ్యాధిని నయం చేయగలదని తప్పుడు ప్రకటన చేసిన ప్రతి ఉత్పత్తిపై రూ. 1 కోటి వరకు జరిమానా విధించడాన్ని పరిశీలిస్తాం’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. కాగా, కరోనా వైరస్ కట్టడిలో ఆధునిక వైద్యం విఫలమైందని, అదో పనికిమాలిందంటూ బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ఐఎంఏ సైతం ఆయనపై రూ.1,000 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. విమర్శలు రావడంతో ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, వివరణ ఇచ్చారు.. తాను ఉద్దేశపూర్వకంగా అలా అనలేదు, వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ను చదివి వినిపించానని తప్పించుకునే ప్రయత్నం చేశారు.