భారతీయులు ముఖ్యంగా దక్షిణాది అల్పాహారంలో దోశకు ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా దోశను మినపపిండి, బియ్యం పిండితో తయారు చేస్తారు. వీటిల్లో పేపర్ దోశ నుంచి పన్నీర్ దోశ ఇలా 100 వరకూ వైరైటీలు ఉన్నాయి. పెనంపై నెయ్యి వేసి కాల్చిన దోశను పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే ఆహా ఆ రుచి అమోఘం. ఇదిలా ఉండగా, ఓ హోటల్ భారీ దోశను తయారుచేయగా.. దానికి గిన్నిస్ రికార్డుల్లో చోటుదక్కింది. బెంగళూరులోని ప్రముఖ సంస్థ ఎంటీఆర్ ఫుడ్స్ 123 అడుగుల పొడవైన అతిభారీ దోశను తయారుచేసింది. తమ సంస్థ ఏర్పడి 100 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈ భారీ దోశను రూపొందించడం విశేషం. మొత్తం 75 మంది చెఫ్‌లు ఈ దోశ తయారీలో పాల్గొన్నారు.
ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతి పెద్ద దోశ పొడవు 54 అడుగులు. ప్రస్తుతం ఎంటీఆర్ దానికి రెట్టింపులో దోశను తయారు చేసింది. ఈ దోశ తయారీకి చెఫ్ రెగి మాథ్యూ నాయకత్వం వహించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘MTR ఒక చారిత్రాత్మక మైలురాయిని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది.. 123.03 అడుగుల పొడవైన దోశను తయారుచేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ సాధించి 100వ వార్షికోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటున్నాం! మార్చి 15, 2024న బెంగళూరులోని ఎంటీఆర్ ఫ్యాక్టరీలో ఈ స్మారక విజయం జరిగింది.. దోశ తయారీలో పాల్గొన్న ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ధన్యావాదాలు.. రుచి, రికార్డులను బద్దలుకొట్టిన శతాబ్దపు సంప్రదాయం ఇది’ అని క్యాప్షన్ పెట్టాడు.
నెలల పాటు శ్రమించి ఎంటీఆర్ రెడ్ రైస్ పిండిని ఉపయోగించి తయారు చేసిన ఈ దోశ ప్రపంచంలోనే అతి పొడవైనది. దీని తయారీలో ఆహార నిపుణులు, పాక శాస్త్ర విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రపంచ రికార్డును సాధించడానికి ముందు 110 సార్లు ప్రయత్నించారు. గిన్నిస్ రికార్డు సృష్టించిన తర్వాత ఉద్యోగులతో పాటు స్థానిక పాఠశాలల విద్యార్థులకు, పరిసర ప్రాంతాల ప్రజలకు దోశను పంచిపెట్టారు.