ఈ రాష్ట్రంలో తన మార్క్ అరాచకం ఏమిటో వైసీపీ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకే రుచి చూపించిందని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మంగళవారం తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ప్రధాని సభలోనే భద్రతా వైఫల్యాలు సృష్టించడం వైసీపీకే చెల్లింది. పోలీసు వ్యవస్థను ఇంత ఘోరంగా దుర్వినియోగం చేసిన ప్రభుత్వం దేశంలో మరొకటి లేదు. చిలకలూరిపేట సభలో ప్రధాని లేచివచ్చి కరెంటు టవర్ మీద ఉన్నవారిని పోలీసులు కిందకు దించాలని విజ్ఞప్తి చేసినా ఏ పోలీసూ పట్టించుకోలేదు. ప్రధాని మాట్లాడే సమయంలో సభలో తోపులాట చోటు చేసుకొని మైకులు పనిచేయలేదు. అక్కడ తోపులాట జరగకుండా పోలీసులు నివారించలేకపోయారు. ఆ దిశగా కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. మా వలంటీర్లను పంపాలని మేం ప్రయత్నిస్తే మమ్మల్ని కదలకుండా నిలిపివేశారు. మాపై పెట్టిన శ్రద్ధలో పదో వంతు కూడా తోపులాటపై పెట్టలేదు. ఇదే తోపులాట వల్ల ప్రధాని భద్రత ప్రమాదంలో పడితే ఏమిటి పరిస్థితి? ప్రధాని వచ్చినప్పుడు ఏం చర్యలు తీసుకోవాలో బ్లూ బుక్‌లో స్పష్టంగా రాసి ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ దానిని పర్యవేక్షించాలి. కాని ఎవరూ ఏదీ పట్టించుకోలేదు. పోలీసులను కావాలని ప్రేక్షక పాత్రకు పరిమితం చేశారు. గతంలో పంజాబ్‌లో ఇలాగే జరిగితే కొందరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ప్రధాని పాల్గొన్న ఈ సభను విఫలం చేయాలని అధికార పార్టీ కుట్రపన్నింది. దీనికి కొందరు పోలీసు అధికారులను వాడుకొంది. సభ లోపలా... బయటా వారి కుట్రలు యఽథేచ్ఛగా జరిగాయి. ప్రజలు ఈ సభకు సాఫీగా రాకుండా ట్రాఫిక్‌ను కావాలని గందరగోళం చేశారు. పార్కింగ్ స్థలాల వద్దకు వాహనాలు వెళ్లకుండా కావాలని వాటిని తప్పుదోవ పట్టించారు. ఇటువంటి పెద్ద పెద్ద సభల నిర్వహణ టీడీపీకి కొత్తేమీ కాదు. కాని పోలీసులు ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రల వల్ల మేం ఇబ్బంది పడాల్సి వచ్చింది. జరిగిన ఘటనలు అన్నింటిపైనా మా పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు, డీఓపీటీకి, యూపీఎస్సీకి, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయబోతోంది. ఈ కుట్రలో భాగస్వాములైన పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు ఉంటేనే ప్రజలకు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది’ అని దీపక్‌రెడ్డి వ్యాఖ్యానించారు.