జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు పెడదారి పట్టాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ అపార్టుమెంట్ వాసులతో ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ లోకేశ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వ్యక్తిగత, విద్వేషపూరితమైన రాజకీయాలకు జగన్ తెర తీశారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలకు మనుగడ లేకుండా చేయడంపై దృష్టి సారించడం ప్రజాస్వామ్యంలో సరికాదని హితవు పలికారు. రాజకీయాల్లో విమర్శలెప్పుడూ విధానాల పరంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మళ్లీ విలువలతో కూడిన రాజకీయాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ విధ్వంసకర పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముందెన్నడూ లేనంత దయనీయంగా తయారైందని లోకేశ్ చెప్పారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలంటే పరిశ్రమలు పెరగాలని, అందుకు తగిన ఎకో సిస్టమ్ అవసరమని తెలిపారు. తెచ్చిన అప్పులను సరైన రీతిలో సద్వినియోగం చేసుకోలేకపోతే శ్రీలంక తరహా పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుందని లోకేశ్ హెచ్చరించారు. ‘‘రాష్ట్ర విభజన మనం కోరుకున్నది కాదు. ఆనాడు కట్టుబట్టలతో బయటకు వచ్చి ప్రయాణం సాగించాల్సి వచ్చింది. అయినప్పటికీ చంద్రబాబు రేయింబవళ్లు శ్రమించి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పోటీపడి పరిశ్రమలు తెచ్చి అభివృద్ధిని సాధించారు’ అని లోకేశ్ పేర్కొన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా మూడేసి రాజధానుల్లేవు... అవగాహన, అనుభవం లేని జగన్ మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ‘అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో చంద్రబాబు ఇప్పటికే చేసి చూపించారు. జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు. విశాఖలో మాత్రం రూ.550 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారు. ఒకే రాష్ట్రం-ఒకటే రాజధాని- అభివృద్ధి వికేంద్రీకరణ’ అనేదే మా విధానం. దీనిని అంతఃకరణ శుద్ధితో ఆచరిస్తాం’ అని లోకేశ్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిపోయిన రాజధాని అమరావతి పనులను పునఃప్రారంభిస్తామని చెప్పారు.