రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ అపహాస్యం చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విమర్శించారు. నియమావళి అమలు దేశవ్యాప్తంగా ఒక రకంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో మరో రకంగా ఉందన్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో ముఖ్యమంత్రి జగన్ కటౌట్ వద్ద ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి వాటిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ అరాచకాలకు ఇదో నిదర్శనమన్నారు. కాగా, మంగళవారం సాయంత్రం అధికారులు ఆ కటౌట్‌ను తొలగించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించిన పత్రాలపై ముద్రించిన సీఎం బొమ్మలను ఏ విధంగా తొలగిస్తారో, వాటిపై చర్యలు ఏమిటో అర్థం కావట్లేదని రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. రేషన్ సరఫరా చేసే వాహనాలపై సీఎం చిత్రాలను ఇప్పటివరకూ తొలగించలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రైతుల పొలాల్లో వేసిన రాళ్లపై కూడా ఆయన ముఖ చిత్రమే ఉందని తెలిపారు. రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులు స్ఫూర్తిదాయకంగా వ్యవహరించి ప్రజల్లో భద్రతాభావం నింపాలని సూచించారు. ఎన్నికలు సక్రమంగా జరిగేలా వ్యవహరించాలని కోరారు. ప్రభుత్వ వనరులు, వ్యవస్థలను, సిబ్బందిని నిస్సిగ్గుగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బాధాకరమని నిమ్మగడ్డ అన్నారు.