ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రస్తుతం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఢిల్లీ తదుపరి సీఎం ఎవరు అనే చర్చ జరుగుతోంది. అయితే కేజ్రీవాల్ జైలులో ఉండి.. పాలన సాగిస్తారని ఆప్ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే.. ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించకముందు నుంచీ కేజ్రీవాల్‌కు సన్నిహితంగా ఉండి.. కొన్ని రోజుల కిందటి వరకు ఢిల్లీ పాలనతోపాటు దేశవ్యాప్తంగా ఆప్ దూసుకెళ్లి జాతీయ పార్టీగా మారడానికి తోడ్పాటును అందించిన మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉండటంతో పార్టీతోపాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు సమర్థవంతమైన నాయకులు ఎవరు అనేది ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే తెరపైకి ఓ నాలుగైదు పేర్లు వస్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్టు కావడంతో ఆప్ నాయకత్వం ప్రశ్నార్థకంగా మారింది. ఆప్‌ను, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారు అనే ప్రశ్న నెలకొంది. 2012 లో ఆప్ స్థాపించినప్పటి నుంచి కన్వీనర్‌గా ఉంటున్న కేజ్రీవాల్ ఇప్పటివరకు 3 సార్లు సీఎంగా గెలిచారు. 10 ఏళ్లలోనే పార్టీని దేశంలో మూడో అతిపెద్ద రాజకీయ పార్టీ స్థాయికి తీసుకువెళ్లారు. కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని.. గతేడాది డిసెంబర్ ఆప్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆయన ఎక్కడి నుంచి అయినా పాలన సాగించాలని 90 శాతం మంది అభిప్రాయపడ్డారు.
సునీతా కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం రేసులో ప్రస్తుతం మొట్టమొదట వినిపిస్తున్న పేరు అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్. ఆమె ఐఆర్‌ఎస్ అధికారిణిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. అయితే ఇప్పటివరకు రాజకీయాలకు సునీతా కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ పాలనా పగ్గాలు చేపడతారా అనేది అనుమానంగా ఉంది. దీనికి తోడు సామాన్యుడిగా వచ్చిన కేజ్రీవాల్.. రాజకీయాల్లో వారసత్వాన్ని, కుటుంబాన్ని తీసుకువస్తారా అనేది కూడా అనుమానంగా ఉంది. దీంతో సునీతా కేజ్రీవాల్.. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టకపోవచ్చు అనే వార్తలు.. పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
అతిషి మార్లేనా
ఢిల్లీ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న అతిషి మార్లేనా కూడా సీఎం రేసులో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నాయకురాలిగా ఉన్న అతిషి మార్లేనా.. ప్రస్తుతం ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితురాలైన అతిషి.. పార్టీ కోర్ టీమ్‌లో ముఖ్యమైన వ్యక్తి. 2020 ఢిల్లీ ఎన్నిక్లలో గెలిచిన అతిషి.. ఢిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత ఆయన నిర్వహించిన విద్యాశాఖతో పాటు పబ్లిక్ వర్క్స్, విద్యుత్, పర్యాటక శాఖ బాధ్యతలను కేజ్రీవాల్ ఆమెకు అప్పగించారు. సిసోడియా విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు సలహాదారుగానూ అతిషి పనిచేశారు.
గోపాల్ రాయ్
ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించక ముందు నుంచీ, రాజకీయాల్లోకి రాకముందు నుంచీ అరవింద్ కేజ్రీవాల్‌తో గోపాల్ రాయ్ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌లతో కలిసి గోపాల్ రాయ్ కూడా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. మొదటి నుంచీ కేజ్రీవాల్ వెంట ఉన్న గోపాల్ రాయ్.. ప్రస్తుతం ఢిల్లీ కార్మిక అభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మరోవైపు.. పార్టీ వ్యవహారాలను కూడా చూసుకుంటున్నారు. అంతే కాకుండా ఆప్ ఢిల్లీ కన్వీనర్‌గా గోపాల్ రాయ్ ఉన్నారు. దీంతో గోపాల్ రాయ్ కూడా ముఖ్యమంత్రిగా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
సౌరభ్ భరద్వాజ్
సౌరభ్ భరద్వాజ్ కూడా ప్రస్తుతం ఢిల్లీ మంత్రిగా ఉన్నారు. 2013 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సౌరభ్ భరద్వాజ్.. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో తొలిసారి ఏర్పాటైన ఢిల్లీ ప్రభుత్వంలో కొన్ని రోజుల పాటు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత సత్యేందర్ జైన్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లడంతో ఆయన స్థానంలో ఢిల్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జైన్ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖతో పాటు పట్టణాభివృద్ధి, జలవనరులు, పరిశ్రమల శాఖలను సౌరభ్ భరద్వాజ్‌కు గతేడాది కేజ్రీవాల్ అప్పగించారు.
రాఘవ్ చద్దా
ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాఘవ్ చద్దా పేరు కూడా సీఎం రేసులో ఉంది. యువ నాయకుడు, విద్యావంతుడైన రాఘవ్ చద్దా.. గతంలో సీఎం కేజ్రీవాల్‌కు సలహాదారుడిగా వ్యవహరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గళం వినిపించే నాయకుల్లో ఒకరైన రాఘవ్ చద్దా కూడా ఢిల్లీ సీఎం పదవికి పోటీ పడుతున్న వారిలో ఉన్నట్లు ఆప్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.