ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌పై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. సౌరభ్ భరద్వాజ్‌ను జైలుకు పంపించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. సౌరభ్ భరద్వాజ్‌తోపాటు ఢిల్లీ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్బీ దీపక్ కుమార్‌లను కూడా జైలుకు పంపే అవకాశం ఉందని కోర్టు హెచ్చరించింది. ప్రస్తుతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఢిల్లీ మంత్రిని ఉద్దేశించి హైకోర్టు ఈ రకంగా వ్యాఖ్యలు చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతోపాటు ఢిల్లీ వాసులను షాక్‌కు గురి చేస్తోంది. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ అయిన ఢిల్లీ లిక్కర్ కేసుకు.. ఢిల్లీ హైకోర్టు వార్నింగ్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఢిల్లీ నగరంలో విస్తరిస్తున్న అక్రమ పాథలాజికల్ ల్యాబ్‌ల విషయంలో హైకోర్టు ఈ హెచ్చరకలు చేసింది.
ఢిల్లీలో పెరిగిపోతున్న అక్రమ పాథలాజికల్ ల్యాబ్‌ల విషయంలో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్బీ దీపక్ కుమార్‌లపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. అలాంటి సంస్థలను నియంత్రించేందుకు చట్టం తీసుకురావడంపై న్యాయపరమైన ఆదేశాలు పాటించలేదని వచ్చిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. విచారణ సందర్భంగా వీరిద్దరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మంత్రి, కార్యదర్శిలు ప్రజా సేవకులు అని.. ఇలాంటి అక్రమ ల్యాబ్‌ల వల్ల ప్రజలు తమ రక్త నమూనాల గురించి తప్పుడు రిపోర్టులు పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి రిపోర్ట్‌ల కారణంగా ప్రజలకు ఏదైనా జరిగితే వారిద్దరినీ జైలుకు పంపించాల్సి ఉంటుందని.. అందులో ఏ సందేహం లేదని హైకోర్టు పేర్కొంది.
ఢిల్లీలోని అనధికార ల్యాబ్‌ల నియంత్రణకు వెంటనే న్యాయపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మంత్రి ఛాంబర్‌లో సౌరభ్ భరద్వాజ్, ఎస్బీ దీపక్ కుమార్‌లతో సమావేశం కావాలని స్టాండింగ్ కౌన్సిల్‌ను ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2022 పై చర్చ జరుగుతున్నప్పుడు వారు నిబంధనలకు అనుకూలంగా వ్యవహరించలేదని కోర్టు తెలిపింది. 2022 నుంచి అక్రమ ల్యాబ్‌ల విషయంలో వాటి నియంత్రణకు ఏర్పాటుచేసిన చట్టాన్ని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయలేదని.. ఆ చట్టం అమలు చేసేందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో వాటి కారణాలు చెప్పేందుకు విచారణకు హాజరు కావాలని హైకోర్టు మంత్రి, కార్యదర్శికి సూచించింది. దీంతో వారిద్దరూ గురువారం విచారణకు హాజరయ్యారు.
ఢిల్లీలో కొన్ని అనధికార ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయని.. 2018లో బెజోన్ కుమార్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సరైన అర్హతలు లేని వారితో అవి నడుస్తున్నాయని.. దీంతో అక్కడికి వచ్చే రోగులకు తప్పుడు రిపోర్టులు వస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి అర్హత లేని ల్యాబ్‌ల సంఖ్య ఢిల్లీ, ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో దాదాపు 20 వేల నుంచి 25 వేల మధ్య ఉండొచ్చని.. దేశ రాజధానిలోని ప్రతీ గల్లీలో అలాంటి ల్యాబ్‌లు ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.