అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం దేశం మొత్తం మారుమోగిపోతున్న పేరు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టడం, ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకోవడం, అనంతరం తన పార్టీని విస్తరించి పంజాబ్‌లో పాగా వేయడం.. దేశవ్యాప్తంగా పోటీ చేయడంతో అరవింద్ కేజ్రీవాల్.. రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారని దేశం మొత్తం భావించింది. అఖిల భారత సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేసి.. ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు చేసిన కేజ్రీవాల్.. అవినీతికి వ్యతిరేకంగా ఎన్నో నిరసనలు, ఉద్యమాలు చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి.. పాలన, ప్రజా పథకాలలో నూతన అధ్యాయాన్ని లిఖించారు. ప్రాంతీయ పార్టీగా ప్రారంభమై దశాబ్ధ కాలంలోనే జాతీయ పార్టీగా ఆప్ ఎదగడంలో కేజ్రీవాల్ ఎంతో కృషి చేశారు. అయితే అనూహ్యంగా ఆ పార్టీ, నేతలు కేసుల పాలు కావడం, జైలుకు వెళ్లడం సంచలనంగా మారింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం, ప్రజలకు మంచి పాలన అందించడమే పునాదులుగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ.. గత కొన్నేళ్ల నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే పలువురు ఆప్ నేతలు అరెస్ట్ అయి జైలు పాలయ్యారు.
ఐఆర్ఎస్‌కు రాజీనామా చేసిన కేజ్రీవాల్
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివిన కేజ్రీవాల్ 1992 లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు సెలక్ట్ అయ్యారు. 1992 నుంచి 2004 వరకు ఇండియన్ రెవెన్యూ సర్వీసులో వివిధ హోదాల్లో కేజ్రీవాల్ పని చేశారు. 2004 లో ఐఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన కేజ్రీవాల్.. సామాజిక కార్యకర్తగా ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు. సమాచార హక్కు చట్టం కోసం పోరాడటంతో దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ పేరు మారుమోగింది. సమాచార హక్కు చట్టం తీసుకురావటంతో కేజ్రీవాల్ కు 2006 లో రామన్ మెగసెసే పురస్కారం లభించింది. ఆ తర్వాత జన లోక్‌పాల్ బిల్లు కోసం సామాజిక కార్యకర్త అన్నా హజారేతో కలిసి చేసిన పోరాటం చేశారు. 2011లో అవినీతికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు, లోక్‌పాల్ బిల్లును అమలు చేయాలంటూ అన్నా హాజారే దీక్షకు దిగిన సమయంలో ఆయన వెంట ఉన్నారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన ఉద్యమంలో కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తెరవెనుక పెద్ద పాత్ర పోషించడంతో కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చారు.
ఉద్యమాలు చేసి రాజకీయాల్లోకి కేజ్రీవాల్
కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ రాజకీయాల్లోకి రాకముందు.. కొంతకాలం అవినీతికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు కలిసి చేశారు. ఈ క్రమంలోనే ఉద్యమాల తర్వాత ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలన్న లక్ష్యంతో కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే 2012 నవంబరు 26 వ తేదీన సొంతంగా ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు. ఆ తర్వాత కొన్ని నెలలకే వచ్చిన 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ.. 28 స్థానాలు గెలుచుకుంది. అయితే పూర్తి మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మొదటిసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఎన్నికయ్యారు. అయితే కూటమిలో విబేధాల కారణంగా 50 రోజులు కూడా గడవకముందే ఆ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు గాను.. ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 67 సీట్లు గెలిచి చరిత్రాత్మక విజయం సాధించింది.
దేశవ్యాప్తంగా ఆప్ విస్తరణ- జాతీయ పార్టీగా అవతరణ
ఢిల్లీలో ఘన విజయం సాధించడంతో అరవింద్ కేజ్రీవాల్ పేరు దేశ రాజకీయాల్లో మార్మోగిపోయింది. ఆ తర్వాత 2022 లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసిన ఆప్.. కొన్ని స్థానాలను గెలుచుకుంది. గోవాలో ఇద్దరు ఎమ్మెల్యేలు, గుజరాత్‌లో ఐదుగురు ఆప్ తరఫున ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో రెండు కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీగా ఆప్ పేరు గడించింది. ఈ క్రమంలోనే 2023 ఏప్రిల్ 10 వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదాను ఇచ్చింది.
ఆప్ దశ మార్చిన ఢిల్లీ లిక్కర్ కేసు
2021-2022 ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో భారీ అవినీతి జరిగిందంటూ కేసు నమోదు కావడం ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ ప్రభుత్వాన్ని షేక్ చేసింది. ఈ కేసులో అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గతేడాది అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా జైలుకు వెళ్లారు. ఇక తాజాగా ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో అవినీతికి వ్యతిరేకంగా పోరాడి.. పార్టీ పెట్టిన కేజ్రీవాల్ చివరికి ఆ అవినీతి ఆరోపణలతోనే అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.