ఏపీలో ఎన్నికల వేడి మొదలైపోయింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేనాటికే పార్టీలన్నీ మెజారిటీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో ఇక ప్రచార పర్వం మొదలు కానుంది. ఇప్పటికే సభల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పార్టీల నేతలు.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో మరింతగా చొచ్చుకెళ్లే్ందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మార్చి 27 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు టీడీపీ రూట్ మ్యాప్, షెడ్యూల్ రెడీ చేసింది.
మార్చి 27 తేదీ నుంచి ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా టీడీపీ ప్రణాళిక రూపొందించింది. 27 తేదీ నుంచి 31 తేదీ వరకు పర్యటనను ఖరారు చేశారు. మార్చి 27వ తేదీ పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్‌లలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.28వ తేదీ రాప్తాడు, సింగనమల, కదిరిలలో చంద్రబాబు పర్యటిస్తారు. ఇక మార్చి 29వ తేదీ శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రజాగళం యాత్ర సాగనుంది.30 మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరిపేట, శ్రీకాళహస్తిలలో పర్యటించనున్న చంద్రబాబు.. మార్చి 31వ తేదీ కావలి, మార్కాపురం, సంతనూతల పాడు, ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
మరోవైపు మార్చి 27 నుంచే సీఎం జగన్ సైతం తన ఎన్నికల ప్రచారం షురూ చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. సిద్ధం సభలకు కొనసాగింపుగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో జగన్ బస్సుయాత్ర జరగనుంది. మార్చి 27న ప్రొద్దుటూరులో సభ నిర్వహిస్తారు. మార్చి 28ననంద్యాలలో బహిరంగ సభ. 29న ఎమ్మిగనూరులో సభ జరగనుంది.
మరోవైపు చంద్రబాబు, జగన్ ఒకే రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది . అలాగే ఇద్దరూ రాయలసీమ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం రాజకీయవర్గాల్లో ఇంట్రస్టింగ్ చర్చకు దారితీస్తోంది. సొంత జిల్లాల నుంచి 27వ తేదీ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఇద్దరు నేతలు.. మార్చి 29 వ తేదీ మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకేసారి పర్యటించనున్నారు.