ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఏపీలో అధికార వైఎస్ఆర్‌సీపీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే ఫ్యాన్ పార్టీ నుంచి జంపయ్యారు. ఏపీ కాంగ్రెస్‌లోకి మరో వైసీపీ ఎమ్మెల్యే చేరిపోయారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా.. వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆదివారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజా గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. చింతలపూడి అభ్యర్థిగా కంభం విజయరాజును వైఎస్ జగన్ ప్రకటించారు. దీంతో అసంతృప్తితో ఉన్న ఎలీజా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
మరోవైపు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ సైతం ఆదివారం ఉదయం బీజేపీలో చేరిపోయారు. ఆయనకు తిరుపతి ఎంపీ టికెట్ దక్కుతుందనే ప్రచారం నడుస్తోంది. అలాగే ఇప్పటికే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ హస్తం పార్టీలో చేరారు. షర్మిల సమక్షంలోనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీ కృష్ణ సైతం ఇటీవలే వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న చేరికలు ఏపీలో తమ పార్టీ పుంజుకుంటోందనే దానికి సంకేతాలని వైఎస్ షర్మిల చెప్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ, నమ్మకానికి ఇది నిదర్శనమని చెప్తున్నారు. అయితే..175 అసెంబ్లీ, 24 ఎంపీ సీట్లకు జగన్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీట్లు దక్కని నేతలు పక్కపార్టీల వైపు చూస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో.. టికెట్లు దక్కని నేతలకు కాంగ్రెస్ పార్టీ మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీని వీడి హస్తం పార్టీలో చేరిపోతున్నారు.