అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రశేఖర్ అనే జనసేన కార్యకర్తకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. చంద్రశేఖర్ అనే జనసైనికుడు అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని.. అతని చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక కార్యదర్శి, ఆరోగ్యశ్రీ ఇంఛార్జి డాక్టర్ హరికృష్ణ చేసిన ట్వీట్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అసలు సంగతిలోకి వస్తే.. చంద్రశేఖర్ అనే జనసైనికుడు గతేడాది అక్టోబర్‌లో అనారోగ్యానికి గురయ్యారు. స్ట్రోక్ రావటంతో అతని కుటుంబసభ్యులు చంద్రశేఖర్‌ను ఆస్పత్రిలో చేర్చారు. వివిధ రకాల పరీక్షలు చేసిన వైద్యులు అతనికి ఆటో ఇమ్యూన్ ఎన్‌సెఫాలిటిస్ ప్యానెల్ చేయాలని సూచించారు. స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి చంద్రశేఖర్ కోలుకోలేకపోయాడు. చంద్రశేఖర్ చికిత్స కోసం అతని కుటుంబం వీలైనంత ప్రయత్నించింది. అయితే వారి ఆర్థిక పరిస్థితి సహకరించకపోవటంతో.. అప్పులు చేసి మరీ చంద్రశేఖర్ చికిత్స కోసం వెచ్చించింది.
దీంతో చంద్రశేఖర్ చికిత్సకు అవసరమైన ఫండ్స్ కోసం పవన్ కళ్యాణ్ అభిమాని మార్చి 22వ తేదీన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. చంద్రశేఖర్‌కు చేసిన వైద్య పరీక్షల వివరాలను ట్వీట్‌కు జతచేస్తూ అతనికి ఆర్థిక సాయం అందించాలని నెటిజన్లను కోరారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్ నంబర్లను కూడా అందుకు జతచేశారు.అయితే జనసైనికులు చేసిన ట్వీట్‌కు ప్రభుత్వం స్పందించింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ జనసైనికుల ట్వీట్ మీద స్పందించారు.
"చంద్రశేఖర్‌కు గతేడాది అక్టోబర్‌లో అతనికి పక్షవాతం వచ్చింది. ప్రస్తుతం వైజాగ్ కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నాం. అతనికి కావాల్సిన వైద్య సౌకర్యాలన్నీ సమకూర్చాలని కేజీహెచ్ సూపరిటెండెంట్‌తో మాట్లాడాం. చంద్రశేఖర్‌కు అవసరమైనవన్నీ అందుతాయి. ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు కూడా తెలియజేశాం. అతని చికిత్సకు అవసరమయ్యే మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్ కింద చెల్లిస్తాం" అంటూ హరికృష్ణ ట్వీట్ చేశారు.
సీఎం ప్రత్యేక కార్యదర్శి ఇచ్చిన రిప్లైను ట్యాగ్ చేసిన వైసీపీ.. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం…
రాజకీయాలు చూడం, రాజకీయాలు చేయం! ఇదీ జగనన్న మార్క్ పాలన! అంటూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.