ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించే పనిలో ఉన్నాయి. ఇక ఎన్నికల నేపథ్యంలో సినీనటులు, పలువురు ప్రముఖులు కూడా తమకు నచ్చిన పార్టీలకు, అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే వారితో కలిసి ప్రచారాలు నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అభ్యర్థికి ఊహించని విధంగా సినీ హీరో మద్దతు లభించింది. జనసేన తరుఫున తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్‌కు సీనియర్ హీరో సుమన్ మద్దతు ప్రకటించారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్‌ను కలిశారు హీరో సుమన్. ఆయనకు మద్దతు ప్రకటించారు. బొలిశెట్టి విజయానికి కృషి చేస్తానని చెప్పారు.బొలిశెట్టి శ్రీనివాస్ నిస్వార్థమైన నాయకుడన్న సుమన్.. సొంత డబ్బు ఖర్చుపెట్టి ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా అభివర్ణించారు. అలాంటి వ్యక్తులే ఇప్పుడు ప్రజలకు కావాలని.. అందుకే అందరూ ఆయనకు ఓటువేసి గెలిపించాలని సుమన్ కోరారు. రాజకీయాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని , అభివృద్ధి చేసే నాయకులనే ఎన్నుకోవాలని సూచించారు. ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపైనా సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ అభివృద్ధి చేశారన్న సుమన్.. ప్రజలు ఎందుకో తిరస్కరించారని అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఏపీలో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే అధికారికంగా తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. మరో 9 స్థానాలలో అక్కడి అభ్యర్థులకు స్పష్టత ఇచ్చి ప్రచారం చేసుకోవాలని సూచించారు. ఆ రకంగానే తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్‌ను ప్రచారం చేసుకోవాల్సిందిగా జనసేన అధిష్టానం సూచించింది. దీంతో బొలిశెట్టి శ్రీనివాస్ ప్రచారంలో పడ్డారు.