తూర్పుగోదావరి జిల్లా దివాన్‌చెరువు నుంచి కొవ్వూరు వరకూ గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జి మళ్లీ కుంగింది. ఆదివారం సాయంత్రం గామన్ బ్రిడ్జిపై కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారిలో 52వ స్తంభం జాయింట్ వద్ద వంతెన అర అంగుళం మేర కుంగింది. వంతెనకు యాక్షన్ ఇచ్చే బేరింగ్‌లు మరమ్మతులకు గురికావడమే దీనికి కారణమని తేల్చారు. దీంతో కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే దారిలో వాహనాలను నిలుపుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వైపు రెండు వైపుల వాహనాలకూ అనుమతివ్వడంతో ఈ దారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభిస్తోంది. నిపుణుల బృందం సోమవారం వచ్చి సమస్యను పరిశీలించి మరమ్మత్తులు చేపట్టనుంది. గామన్ సంస్థ 2007లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది. విజయవాడ-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ హైవేకు అనుసంధానంగా గోదావరిపై సుమారు రూ.808 కోట్లతో గామన్ బ్రిడ్జిని నిర్మించారు. 2015లో పుష్కరాల నిమిత్తం హడావుడిగా ప్రారంభించారు. అయితే ఆరంభంలోనే ఈ బ్రిడ్జి ఒకసారి కుంగింది. మళ్లీ ఇన్నేళ్లకు మరమ్మతులకు గురైంది. గామన్ బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు.