దేశ రాజకీయాల్లో ఇప్పుడు గ్యారెంటీల ట్రెండ్ నడుస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడి రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామంటూ ఓటర్లకు గ్యారెంటీలు గుప్పిస్తున్నాయి. ఇలా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారెంటీలు తెలంగాణలో హస్తం పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరుగుతుండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం గ్యారెంటీలు ప్రకటిస్తున్నారు. ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తే ఏమేం చేస్తామో ముందే ప్రకటిస్తున్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. త్వరలోనే అక్కడి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.
అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ప్రకటించారు. తనను గెలిపిస్తే పిఠాపురం ప్రజలకు ఏమేం చేస్తానో వెల్లడించారు. ఇది మా వాగ్ధానం గెలిపించడం మీ బాధ్యత అంటూ ఆరు గ్యారంటీలు ప్రకటించారు. ఇదే స్లోగన్‌తో పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. యువతకు ఉద్యోగాల కల్పన, చేనేత రంగం అభివృద్ధి, ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురం, పర్యాటకంగా అభివృద్ధి, మత్స్యకారుల కోసం ప్రత్యేక జెట్టీలు, కోస్టల్ కారిడార్ మీద ప్రత్యేక దృష్టి అనే ఆరు అంశాలను పవన్ ప్రస్తావించారు. తాను గెలిచిన తర్వాత పిఠాపురం ఇలా ఉంటుందని ట్వీట్ చేశారు.
మరోవైపు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి జనసేన పార్టీ షెడ్యూల్ ఖరారు చేసింది. మార్చి 30 వ తేదీ నుంచి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు పిఠాపురంలో పవన్ ఎన్నికల ప్రచారం సాగనుంది. 30 న నియోజకవర్గస్థాయి నేతలతో సమీక్ష, శ్రీపాదవల్లభుడి దర్శనం ఉంటుంది. 31న ఉప్పాడ సెంటర్లో వారాహియాత్ర బహిరంగ సభ నిర్వహిస్తారు. ఏప్రిల్ ఒకటో తేదీన జనసేన పార్టీలోకి చేరికలు, మేధావులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఇక ఈ మూడు రోజులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉండనున్నారు.