వేసవికి ముందు నుంచే బెంగళూరు నగరం నీటి కొరతతో అల్లాడిపోతోంది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే బెంగళూరు ఐటీ సిటీలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన ఐటీ ఉద్యోగులు నీరు లేక నరకం అనుభవిస్తున్నారు. బోర్లు ఎండిపోవడం, బెంగళూరు నగరానికి తాగు నీటిని అందించే కావేరీ జలాలు అడుగంటిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే స్నానాలు చేయడం ఆపేసి.. వారానికోసారి చేస్తున్నారు. ఇక నీటిని వృథా చేయకుండా చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటున్నారు. ఇక నీటి వృథాను అరికట్టడానికి అధికారులు, అపార్ట్‌మెంట్ వాసులు, హౌసింగ్ సొసైటీలు అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయినా కొందరు మాత్రం నీటిని వృథా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే అనవసర పనులకు తాగు నీటిని వినియోగించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. నీటిని వృథా చేస్తున్న వారిపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బెంగళూరు నగర అధికారులు చర్యలు చేపట్టారు. తమ ఆదేశాలను ఉల్లంఘించి నీటిని వృథా చేసినందుకు 22 కుటుంబాలకు జరిమానాలు విధించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.1.1 లక్షల ఫైన్ వేశారు. బెంగళూరు నగరాన్ని నీటి కొరత వేధిస్తున్న వేళ.. తాగునీరు సంరక్షణకు తాము ఇచ్చిన ఆదేశాలను ఆ 22 కుటుంబాలు అతిక్రమించాయని.. అందుకే ఫైన్లు వేసినట్లు బెంగళూరు నీటి సరఫరా మురుగునీటి బోర్డు వెల్లడించింది.
ఈ 22 కుటుంబాలకు చెందిన వారు తాగునీటిని కార్లు కడగడానికి, గార్డెన్‌లో చెట్లకు నీరు పోసేందుకు ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. వారి నుంచి మొత్తం రూ.1.1 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడించారు. బెంగళూరు దక్షిణ ప్రాంతం నుంచే అత్యధికంగా రూ.80 వేలు జరిమానాలు వసూలు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే మరోసారి అధికారులు.. బెంగళూరు నగరవాసులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వేసవి ఉద్ధృతంగా ఉండే ఏప్రిల్, మే నెలల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని బెంగళూరు వాసులు తీవ్ర బెంగలో ఉన్నారు.
వాహనాలు కడగడం, భవన నిర్మాణాలు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌ల కోసం ఎట్టి పరిస్థితుల్లో తాగునీటిని ఉపయోగించకూడదని తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని ముందే చెప్పింది. మళ్లీ మళ్లీ ఇలాగే తాగు నీటిని వృథా చేస్తే ప్రతిసారీ రూ.500 అదనంగా ఫైన్లు వేస్తామని ఆదేశాలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా హోలీ పండగ సందర్భంగా బెంగళూరు నగరవాసులు కావేరీ, బోరుబావుల నీటిని పార్టీలు, రెయిన్ డ్యాన్స్‌ల కోసం ఉపయోగించకూడదని తెలిపింది.