ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 25న (సోమవారం) కనువిందు చేయనుంది. అయితే, హోలీ పండగ రోజున చంద్రగ్రహణం ఏర్పడటం 100 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. హిందువులు ఏటా ఫాల్గుణ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజున హోలీ వేడుకలను జరుపుకుంటారు. హోలీ పండుగ రోజునే ఏర్పడుతున్న ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు. జర్మనీ, నెదర్లాండ్, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. భూమికి చంద్రుడి ఉపగ్రహం కావడం.. పెద్దది అవడం వల్ల నీడ కూడా ఎంతో ఎక్కువ. ఈ కారణంగా, సూర్యగ్రహణాల కంటే చంద్రగ్రహణాలు చాలా ప్రాంతాలలో వీక్షించే ఆస్కారం ఉంటుంది.
ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10.24 గంటల ప్రారంభమై.. మధ్యాహ్నం 03.01 గంటల వరకు కొనసాగుతుంది. ఏకంగా 4.36 నిమిషాల పాటు సాగే ఇది అరుదైన పెనంబ్రల్ చంద్రగ్రహణం.. మళ్లీ 2042లో మాత్రమే సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మార్చి 24, 25 మధ్య రాత్రి చంద్రుడు ఘోస్ట్‌లా ఎగురుతాడు కాబట్టి దీనిని ‘ఘోస్ట్ చంద్ర గ్రహణం’ అని కూడా పిలుస్తారు.
సాధారణంగా భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖపై వచ్చినపుడు గ్రహణాలు ఏర్పడతాయి. జాబిల్లి, సూర్యుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు ఆ నీడ చంద్రుడిపై పడితే చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఆ సమయంలో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. ఇది పౌర్ణమి నాడు మాత్రమే సంభవిస్తుంది. ఫలితంగా పౌర్ణమిరోజు నిండు చంద్రుడు గ్రహణ సమయంలో కనిపించడు. అంతేకాకుండా గ్రహణానికి ముందు చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశిస్తాడు. సూర్యకాంతి పొందిన భూమి వాతావరణం.. జాబిల్లిపై ప్రతిబింబించడంతో ఎర్రగా మారుతుంది. అయితే, అన్ని పౌర్ణమిలలోనూ చంద్రగ్రహణం ఏర్పడదు.
పెనంబ్రల్ గ్రహణ సమయంలో చందమామ ఎరుపు రంగులో కాకుండా మరింత చీకటిలో ఉన్నట్లు కనిపిస్తాడు. ఎందుకంటే, ఈ చంద్రగ్రహణంలో భూమి కోణం 5 డిగ్రీల ఎత్తులో ఉంటుంది. దీని వల్ల భూవాతావరణ ప్రభావం చంద్రుడిపై ఉండదు కాబట్టి గ్రహణం తేలికైన రంగులో కనిపిస్తుంది. పాక్షిక, సంపూర్ణ గ్రహణాల కంటే దీనిని గుర్తించడానికి నిశిత పరిశీలన అవసరం అవుతుంది. అందువల్ల ఈ చంద్రగ్రహణం తరచుగా ఏర్పడే 'అంబ్రల్' కాకుండా పెనంబ్రల్ చంద్రగ్రహణం అని పరిశోధకులు పేర్కొన్నారు.
చంద్ర గ్రహణాలు సాధారణంగా మూడు రకాలు. సంపూర్ణ, పాక్షిక, పెనుంబ్రల్ గ్రహణాలు ఉన్నాయి. చంద్రుడు పెనుంబ్రల్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు బయట ప్రాంతంలో భూమి నీడ సన్నగా కనిపిస్తుంది. కాగా, ఖగోళ పరిశోధకుల ప్రకారం, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా,అమెరికాలోని కొన్ని ప్రాంతాలు గ్రహణం వీక్షించే అవకాశం ఉంది.