వాళ్లు ముగ్గురూ పిల్లలే. ఒకడి వయస్సు 11 ఏళ్లు. మరొకడికి 12, ఇంకొకడికి 16 ఏళ్లు. ఇంట్లో అడిగితే తల్లిదండ్రులు డబ్బులివ్వలేదో.. మరే వ్యసనానికైనా అలవాటు పడ్డారో.. అవసరాల కోసం ఏకంగా బ్యాంకులోనే దొంగతనానికి పాల్పడ్డారు. క్యాషియర్‌ను బెదిరించి చేతికి అందిన డబ్బులతో ఉడాయించారు. ఈ నెల 14వ తేదీన టెక్స్‌సలోని వెల్స్ ఫార్గో బ్యాంకులో ఈ ఘటన జరిగింది. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ముగ్గురి ఫొటోలను ఎఫ్‌బీఐ ఎక్స్‌లో పోస్టు చేస్తూ ‘‘ఈ లిటిల్ రాస్కెల్స్‌ను గుర్తించడానికి సాయం చేయండి’’ అని ప్రజలను కోరింది. అయితే, ఈ ముగ్గురిలో ఇద్దరిని వాళ్ల తల్లిదండ్రులే గుర్తించి ఎఫ్‌బీఐకి ఫోన్ చేసి పట్టించారు. మరో బాలుడిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. మొత్తానికి దొంగతనం జరిగిన వారం రోజుల తర్వాత ఈ నెల 21న ఎఫ్‌బీఐ ఆ ముగ్గురు పిల్ల దొంగలను అరెస్టు చేసింది.