ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై తీవ్ర ప్రభావం చూపిన ఎల్‌నినో నెమ్మదిగా బలహీనపడుతోంది. కొద్ది రోజులుగా పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతుండడం ఇందుకు సంకేతమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఎల్‌నినో ఇప్పటికికప్పుడు కాకుండా నిదానంగా బలహీనపడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్‌నినో తిరోగమన దశ మొదలైనా వచ్చే రెండు, మూడు నెలలు దేశంలో ఎండలు మాత్రం ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో గరిష్ఠ స్థాయికి చేరుకున్న సూపర్ ఎల్‌నినో తన తీవ్రత తగ్గించుకునే దిశగా పయనిస్తోందని, అదే జరిగితే ఈ ఏడాది మే నాటికి తటస్థ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. అయితే ఒక్క ఎల్‌నినో బలహీనపడినంత మాత్రాన నైరుతి రుతుపవనాల సమయంలో మంచి వర్షాలు కురుస్తాయని ఒక అంచనాకు రాకూడదని వాతావరణవేత్తలు పేర్కొంటున్నారు. కాగా, గతేడాది జనవరిలో ఎల్‌నినో తీవ్రత మొదలై నైరుతి రుతుపవనాల సీజన్‌లో మరింత బలంగా కొనసాగింది. దీంతో భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ యేడు జూన్ నాటికి లానినా ప్రారంభమై క్రమేపీ దాని ప్రభావం పెరుగుతుందని అంచనా.