పేదలకు సామాజిక పెన్షన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచుతానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఒకటో తేదీనే ఇంటికి పంపించేలా చేస్తానన్నారు. బయటి ప్రాంతాలకు వెళ్లినవారికి మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే టీడీపీ, జనసేన, బీజేపీ ఎజెండాగా పేర్కొన్నారు. సోమవారం తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన పర్యటించారు. మధ్యాహ్నం మహిళలతో సమావేశం అనంతరం బస్టాండు సర్కిల్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. కుప్పం నుంచే ఎన్నికల శంఖం పూరిస్తున్నట్లు ప్రకటించారు. 175 నియోజకవర్గాల్లోనూ టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సంకల్పం తీసుకోవాలన్నారు. కేంద్రంలో ఎన్డీయే 400 ఎంపీ సీట్లను గెలవాలని, రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి 160కిపైగా అసెంబ్లీ స్థానాలు గెలవాలని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ కల్యాణ్ ముందుకొచ్చారని.. రాష్ట్ర పరిస్థితి చూసి మోదీ కూడా ముందుకొచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తపన తప్ప వేరే ఆలోచన లేదని.. తమను ఆశీర్వదించి తమతో నడవాలని, టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపిచ్చారు.