ఓడలో విశాఖ పోర్టుకు వచ్చి పట్టుబడిన డ్రగ్స్ కేసులో ప్రజలను ఏమార్చాలని ప్రయత్నించిన సంధ్య ఆక్వా కంపెనీ అడ్డంగా దొరికిపోయిందని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారంలో తెరవెనుక ఉన్న వైసీపీ నేతల సలహాలతో విషయాన్ని తప్పుదోవ పట్టించాలని సదరు కంపెనీ అనుకొందని, కాని వీలు కాలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘బ్రెజిల్ నుంచి విశాఖకు నౌకలో వచ్చిన పాతిక వేల కిలోల డ్రై ఈస్ట్‌లో డ్రగ్స్ కలిసి ఉన్నాయని సీబీఐ అధికారులు కనుగొన్నారు. దానిపై విచారణ జరుగుతోంది. డ్రై ఈస్ట్‌ను సంధ్య ఆక్వా కంపెనీ దిగుమతి చేసుకొంది. సీబీఐ అధికారుల విచారణపై సంధ్య ఆక్వా కంపెనీ ఈ నెల 22న ఒక ప్రకటన విడుదల చేసింది. బ్రెజిల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ జనవరి 17వ తేదీన తాము దిగుమతి చేసుకొంటున్న డ్రై ఈస్ట్‌ను తనిఖీ చేసి అంతా బాగానే ఉందని సర్టిఫికెట్ ఇచ్చారని, ఆ తర్వాతే నౌక అక్కడ నుంచి బయలుదేరి వచ్చిందని అందులో పేర్కొన్నారు. కాని ఈ ప్రకటన నిజం కాదు. డ్రై ఈస్ట్‌తో వస్తున్న నౌక జనవరి 14నే బ్రెజిల్ నుంచి బయలుదేరి వచ్చింది. ఓషన్ నెట్‌వర్క్ సంస్థ తన వెబ్‌సైట్‌లో ఈ వివరాలన్నీ స్పష్టంగా పేర్కొంది. బ్రెజిల్‌లోని శాంటోజ్ పోర్టు నుంచి జనవరి 14వ తేదీ సాయంత్రం బయలుదేరిన ఈ నౌక హ్యాంబర్గ్ పోర్టు మీదుగా ఈ నెల 16న విశాఖకు వచ్చింది. ఈ నౌక జనవరి 14నే అక్కడ నుంచి బయలుదేరితే 17న బ్రెజిల్ వ్యవసాయ శాఖ ఎలా తనిఖీ చేయగలుతుంది? ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అసత్యాలతో పత్రికా ప్రకటనలు చేస్తున్నారు’ అని ఆయన చెప్పారు. ఈ వ్యవహారంలో కీలకమైన ఆధారాలు మాయం చేయడానికి జగన్ డ్రగ్ మాఫియా విశ్వ ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ‘సంధ్య కంపెనీకి చెందిన బస్సు కాకినాడలోని కొత్త మూలపేట సెజ్ పక్కన రెండు మూడు రోజు ల నుంచి అనుమానాస్పదంగా నిలిచి ఉంది. పోలీసుల తనిఖీలో ఆ బస్సులో కీలక ఫైళ్ళు, హార్డ్ డిస్కులు, చెక్‌బుక్కులు దొరికాయి. వీటిని పోలీసులు సీబీఐకి అప్పగించకుండా సంధ్య ఆక్వాకే అప్పగించారు. రికార్డులను నిందితులకే అప్పగించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సీబీఐకి అవి దొరక్కుండా ఉండటానికే వాటిని బస్సులో పెట్టి తరలించారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే ఈ వ్యవహారం అంతా చోటు చేసుకొంది. ’ అని పట్టాభి అన్నారు.