ఇప్పటికే ప్రకటించిన ఇద్దరు ముగ్గురు అసెంబ్లీ అభ్యర్థులపై టీడీపీ పునరాలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా మడకశిర(ఎస్సీ) స్థానానికి తొలుత అనిల్ పేరు ప్రకటించారు. కానీ ఆయనతో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం తీవ్రంగా విభేదిస్తోంది. దీంతో ఆ సీటుకు పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేరు తెరపైకి వచ్చింది. విజయనగరం జిల్లా గజపతినగరం అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ పేరు మొదట ప్రకటించారు. కానీ అక్కడ కొన్ని సమస్యలు వచ్చి ప్రచారం ముందుకు నడవడం లేదు. తాజాగా ఈ సీటుకు కళావెంకట్రావు పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట (ఎస్సీ) అభ్యర్థినిగా డాక్టర్ నెలవల విజయశ్రీ పేరు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం ఆమె తండ్రి. ఆయనతో వస్తున్న తలనొప్పులతో ఆ సీటుపై కూడా పునరాలోచన జరుగుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డి పనితీరుపై కూడా పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. కర్నూలు జిల్లాలో ఆదోని సీటును బీజేపీకి ఇచ్చారు. ఆ సీటు బదులు ఆలూరు తీసుకోవాలని టీడీపీ నేతలు ప్రతిపాదించారు. బీజేపీ నేతలు ఇందుకు సుముఖత చూపడం లేదు. ఆదోనిలో బీజేపీ పోటీ చేస్తే అక్కడ ఆ పార్టీ అభ్యర్థి సామాజిక వర్గాన్ని బట్టి ఆలూరులో తమ అభ్యర్థిని ఎంపిక చేయాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థిగా రాఘవేందర్‌ను ఖరారుచేసింది. ఆదోని అభ్యర్థిత్వం మంత్రాలయంపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని టీడీపీలో కొన్ని వర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి.