విజయవాడ, కొత్త ఆటోనగర్‌లోని క్రూడ్ ఆయిల్ రీ సైక్లింగ్ కంపెనీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంపెనీలోని బాయిలర్లు పనిచేయడం మొదలుపెట్టిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. పెనమలూరు మండలం కానూరులోని కొత్త ఆటోనగర్‌లో శ్రీనివాసరావు అనే వ్యక్తి వాహనాల్లో వాడేసిన ఇంజన్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తుంటాడు. దీన్ని రీసైక్లింగ్ చేసి మార్కెట్లో విక్రయించడానికి బాయిలర్లను ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తం నాలుగు బాయిలర్లలో శుద్ధి చేసిన ఆయిల్‌ను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నింపి డీలర్లకు సరఫరా చేస్తుంటాడు. ఆయిల్ రీసైక్లింగ్ అయ్యాక దానిలో శుద్ధి శాతాన్ని తెలుసుకునేందుకు శాంపిల్స్ తీస్తుంటారు. మంగవారం ఉదయం శాంపిల్స్ తీస్తుండగా, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఆయిల్ పరిశ్రమ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి మొత్తం పరిశ్రమకు వ్యాపించాయి. ఈ ఘటనలో బాయిలర్లు పూర్తిగా కాలిపోయాయి. ఆటోనగర్, ఉయ్యూరు, గన్నవరం, కొత్తపేట అగ్నిమాపక కేంద్రాల నుంచి ఐదు వాహనాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన శాఖల అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. మంటలను అదుపు చేసే ఆపరేషన్ దాదాపు ఐదు గంటలపాటు సాగింది.