దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వసంస్థలు పూర్తిగా ప్రైవే టుపరం అవుతాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ అన్నారు. గన్నవరంలోని అట్లూరి శ్రీమన్నారాయణ మీటింగ్ హాలులో మంగళవారం సీఐటీయూ డివిజన్‌స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముజఫర్ మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని విభాగాలను ప్రైవేటుపరం చేశారని, టెలీకమ్, విమానాశ్రయాల్లో జరుగుతున్న వ్యవహారమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. అదాని, అంబానీలకు వాటిని కట్టబెట్టేందుకు మోదీ సిద్ధమయ్యారని, విద్యుత్‌రంగంలో కూడా సంస్కరణలు తీసుకువచ్చి ఒకటికి ఏడురెట్లు కరెంటు బిల్లులు పెరిగే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. మరోవైపు హిం దూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొం దాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రస్తుతం అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్నభోజనపథకం కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సమరశీల పోరాటాలు చేసి ప్రభుత్వా లను నిలదీస్తున్న సీఐటీయూకి వామపక్షాలు పూర్తిగా సహకారం అందిస్తున్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎర్రజెండా అభ్యర్థి గన్నవరంలో పోటీ చేస్తున్నారని కార్మికులంతా మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో కార్మికులంతా ఇంటింటికీ వెళ్లి కార్మికుల కోసం పనిచేసే ఎర్రజెండా అభ్యర్థికి ఓటువేయాలని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత వుందన్నారు. నాలుగు మండలాల్లోని అసంఽఘటిత కార్మికులంతా ఏకమై మీ వంతు సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మాదల వెంకటేశ్వరరావు, నాయకులు కళ్లం వెంకటేశ్వరరావు, బేతా శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, కడవకొల్లు రామరాజు తదితరులు పాల్గొన్నారు.