ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నట్లు సీఎం జగన్ ఉత్తుత్తి జీవోలు విడుదల చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రామకుప్పంలో హంద్రీ-నీవా-కుప్పం కాలువ ద్వారా నీళ్లను వదులుతున్నట్లు డమ్మీ బటన్ నొక్కారని ఎద్దేవాచేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మంగళవారం రెండో రోజూ పర్యటించారు. కుప్పంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన యువత సమావేశంలో మాట్లాడారు. ఇటీవల రామకుప్పం మండలం రాజుపేట వద్ద సీఎం జగన్ కుప్పం బ్రాంచి కెనాల్ గేటు బటన్ నొక్కి నీళ్లను వదిలిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుప్పానికి నీరిచ్చానని డప్పు కొట్టుకున్న మరుసటి రోజే కాలువలో నీళ్లు ఇంకిపోయాయి. ట్యాంకర్లో నీళ్లు తెచ్చి పోసి సినిమా సెట్టింగులా గేటు పెట్టి బటన్ నొక్కి వెళ్లిపోయాడని.. తెచ్చిపోసిన నీళ్లు తెల్లారేసరికి ఇంకిపోయాయని.. అద్దెకు తెచ్చిన గేట్లను సాయంత్రానికి అధికారులు తీసుకెళ్లిపోయారని.. ఇలాంటి సినిమా సెట్టింగుల సీఎం వస్తాడని డైరెక్టర్లు, నిర్మాతలు కూడా అనుకుని ఉండరని వ్యాఖ్యానించారు. ఐదేళ్లు నడిపిన వైసీపీ డ్రామా కంపెనీని శాశ్వతంగా మూసేయబోతున్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా కుప్పానికి నీళ్లు తెస్తానని హామీఇచ్చారు. వలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని.. వారి జీవితాలు మారుస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఇంత విధ్వంసాన్ని తన జీవితంలో చూడలేదన్నారు. కేంద్రం సాయం లేకుంటే రాష్ట్రాభివృద్ధి కష్టమవుతుందని.. అన్నిటినీ సరిచేయడానికే ఎన్డీయేలో చేరామని చెప్పారు.