ఏపీ పర్యాటక మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజాపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పంచులేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో చంద్రబాబు ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన చంద్రబాబు.. మంత్రి రోజాపై విమర్శలు చేశారు. ఇక్కడో ఎమ్మెల్యే ఉంది జబర్దస్త్ ఎమ్మెల్యే. నియోజకవర్గానికి ఏమైనా చేశారా? భువనేశ్వరి అనే మహిళ వద్ద మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తామని రూ.40 లక్షలు తీసుకున్నారు. ఇలాంటోళ్లను మీరు నమ్ముతారా, ఇలాంటోళ్లకు మీరు ఓటేస్తారా?.. అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. నగరిలో ఇసుక, గ్రావెల్ సహా అన్నీ దోచుకున్నారన్న చంద్రబాబు నాయుడు.. దౌర్జన్యం, భూ దందాలతో రోజా కుటుంబం దోచుకుందని ఆరోపించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమనతో కలిసి రోజా పాదిరేడు అరణ్య భూములు దోచుకున్నారని ఆరోపించారు.
మరోవైపు మంత్రి రోజా మీద పుత్తూరు మున్సిపాలిటికీ చెందిన వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి.. ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తామని మంత్రి రోజా సోదరులు తన వద్ద రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశారని ఇటీవల ఆరోపించారు. పదవి పేరు చెప్పి తన దగ్గర డబ్బులు తీసుకున్నారని.. ఇప్పుడు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారంటూ ఇటీవల భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. మంత్రి రోజాఈ ఆరోపణలను ఖండించారు కూడా. అయితే ఇప్పుడు అదే మహిళను చంద్రబాబు తన వాహనంపైకి తీసుకువచ్చి మరీ మంత్రి రోజాపై పంచులేశారు.
మరోవైపు పుత్తూరు సభలో చంద్రబాబు ఎన్నికల హామీలు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే నగరిలోని చక్కెర్ ఫ్యాక్టరీ మళ్లీ తెరిపిస్తామన్నారు. అలాగే చేనేత కార్మికులకు 500 ల యూనిట్ల వరకూ కరెంట్ ఫ్రీగా అందిస్తామన్నారు. 90 రోజుల్లోగా మెగా డీఎస్సీ వేస్తామన్న చంద్రబాబు.. ఒకటో తేదీనే ఇంటివద్ద నాలుగు వేల పింఛన్ అందిస్తామని చెప్పారు. అన్నాక్యాంటీన్లను మళ్లీ తెరిపిస్తామని.. నిరుపేదలకు నాణ్యమైన ఆహారం అందిస్తామని హామీ ఇచ్చారు.యుద్ధం మొదలైందని.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షమేనని.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి జనం మద్దతు పలుకుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.