రఘురామకృష్ణరాజు.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు. కూటమి తరుఫున నరసాపురం ఎంపీగా ఈయన పోటీ చేయడం పక్కా అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని ట్విస్ట్ జరిగింది. రాజుగారికి బదులుగా బీజేపీ అధిష్టానం మరో వ్యక్తికి నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించింది. అనూహ్యంగా భూపతిరాజు శ్రీనివాసవర్మకు టికెట్ కేటాయించారు. దీంతో రఘురామకృష్ణరాజుకు నిరాశే ఎదురైంది. అయితే ఆయన టీడీపీలో చేరతారని, అసెంబ్లీకి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. లేదు లేదు విజయనగరం ఎంపీ టికెట్ ఇస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే అవేమీ జరగకపోగా.. టీడీపీ తన పెండింగ్ అసెంబ్లీ, ఎంపీ సీట్లకు సైతం అభ్యర్థులను ప్రకటించేసింది.
పొత్తులో భాగంగా తనకు వచ్చిన 144 అసెంబ్లీ సీట్లకు, 17 ఎంపీ సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అలాగే బీజేపీ కూడా 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. జనసేన నుంచి మూడు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానానికి మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరి రఘురామ పొలిటికల్ భవిష్యత్తు ఏంటీ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే నరసాపురం ఎంపీ టికెట్ తనకే వస్తుందని ఇప్పటికీ ధీమాగా ఉన్నారు రఘురామ.
మరోవైపు వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి 135 సీట్లు వస్తాయని రఘురామకృష్ణరాజు అంచనా వేశారు. గతంలో ఇదే మాట చెప్పాననీ, ఇప్పటికీ అదేమాట చెప్తున్నానని అన్నారు. 135 సీట్లకు ఓ 15 సీట్లు అటూ ఇటూ కావచ్చని రఘురామ జోస్యం చెప్పారు. ఏపీలో ఎన్డీయే విజయం ఖాయమని, సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం పక్కానని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.
మరోవైపు బీజేపీ తనకు టికెట్ కేటాయించకపోవటం వెనుక ఉన్న కారణాలను రఘురామకృష్ణరాజు అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఏపీ బీజేపీ నాయకత్వం ఇచ్చిన తప్పుడు సమాచారం వలనే తనకు టికెట్ రాలేదన్న ఆయన.. కేంద్ర పెద్దలు తనతో మంచిగానే ఉన్నారని చెప్పారు. ఇక్కడే ఏదో తేడా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.