గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ అమేథీ స్థానంలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన మరో స్థానం కేరళలోని వయనాడ్ నుంచి గెలిచారు. దీంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కూడా వయనాడ్ నుంచే రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ స్థానంలో బీజేపీ.. ఏకంగా ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడినే రంగంలోకి దింపింది. కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్.. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఢీకొట్టనున్నారు. అయితే కే సురేంద్రన్‌పై ఏకంగా 242 క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం.
ఈ క్రమంలోనే తనపై ఇప్పటివరకు నమోదైన కేసుల గురించి కే సురేంద్రన్ ఒక పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తనపై ఉన్న కేసుల వివరాలను కే సురేంద్రన్ వెల్లడించారు. అయితే కే సురేంద్రన్‌పై నమోదైన 242 కేసుల్లో 237 కేసులు.. 2018లో శబరిమలకు సంబంధించి నిరసనలు చేపట్టినప్పుడు నమోదయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు.. కే సురేంద్రన్‌తో పాటు ఎర్నాకుళం నుంచి పోటీ చేస్తున్న మరో బీజేపీ అభ్యర్థి కేఎస్ రాధాకృష్ణన్ పైన కూడా 211 కేసులు ఉన్నట్టు పత్రికా ప్రకటనలో తెలిపారు. అయితే కేఎస్ రాధాకృష్ణన్ కేసుల్లో కూడా ఎక్కువగా శబరిమల నిరసనలకు సంబంధించినవే ఉన్నాయని వెల్లడించారు.
అయితే ఈ కేసులన్నీ ప్రస్తుతం కోర్టు పరిధిలో విచారణ దశలో ఉన్నట్లు తెలిపారు. పార్టీ నేతలు సమ్మె లేదా ఆందోళనలకు పిలుపునిచ్చినప్పుడు.. అలాంటి సమయాల్లో వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారని.. కేరళ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జార్జ్ కురియన్ తెలిపారు. ఈ కేసులన్నీ అలా నమోదైనవేనని చెప్పారు. ఇక ఇదే అంశంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జాతీయవాదిగా ఉండటం చాలా కష్టమని.. అలా ఉండటం రోజు వారీ పోరాటంతో సమానం అని వెల్లడించారు. కానీ అలాంటి పోరాటాలు చాలా విలువైనవని.. ఒక్క వ్యక్తి వందలాది కేసులు అంటూ పేర్కొంటూ కే సురేంద్రన్‌ను బీఎల్ సంతోష్ ట్విటర్‌లో ట్యాగ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి, గాంధీల కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో 2019 లో ఆ పార్టీకి, రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ తరఫున పోటీ చేసిన స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు. అయితే 2019 లో అమేథీతోపాటు వయనాడ్‌లోనూ పోటీ చేసిన రాహుల్.. ఇక్కడ గెలవడంతో లోక్‌సభకు ఎన్నికయ్యారు.