తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రెండో తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఉగాది పర్వదినం, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాల వంటి సమయంలో ఆ వారంలో వచ్చే మంగళవారం నాడు టీటీడీ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తూ వస్తోంది.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 9 వ తేదీ ఉగాది పండుగను పురస్కరించుకుని ఏప్రిల్ రెండో తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకూ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకూ ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో కప్పి ఉంచుతారు. ఆలయ శుద్ధి అనంతరం ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడతారు. ఆ తర్వాత మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం అంటే ఏప్రిల్ 2వ తేదీ వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 11 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.
మరోవైపు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది ఆస్థానం జరగనుంది. ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలపనున్న అర్చకులు.. తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం జరగుతుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఉగాది నేపథ్యంలో గోవిందరాజస్వామి ఆలయంలో ఏప్రిల్ 4వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. భక్తులను ఉదయం 9.30 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు.