తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజరపు అచ్చన్నాయుడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ ఆదివారం కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని స్వగృహంలో తుదిశ్వాశ విడిచారు. 90 ఏళ్ల కళావతమ్మ గత కొంతకాలంగా వయోభారంతో వచ్చిన సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. కింజరపు అచ్చెన్నాయుడు నాన్న దాలినాయుడు సుమారు15 ఏళ్ల కిందట కన్నుమూశారు.
కింజరపు దాలినాయుడు, కళావతమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. పెద్ద కొడుకు ఎర్రన్నాయుడు టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. 12 ఏళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు కన్నుమూశారు. రెండో కొడుకు హరివరప్రసాద్ కోటబొమ్మాళిలో పీఏసీఎస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. మూడో కొడుకు ప్రభాకర్ పోలీస్ శాఖలో డీఎస్పీగా కొనసాగుతుండగా.. అచ్నెన్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
మరోవైపు అచ్చెన్నాయుడు మాతృ వియోగం పట్ల టీడీపీ నేతలు విచారం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కళావతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అచ్చెన్నాయుడు కుటుంభసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. అచ్చెన్నాయుడు ఈ ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న అచ్చెన్న విషయం తెలియగానే హుటాహుటిన... ఇంటికి బయల్దేరి వెళ్లారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఇవాళ సాయంత్రం లేదా సోమవారం ఉదయం అచ్చెన్న ఇంటికి వెళ్లనున్నట్లు సమాచారం.