తెలంగాణ పోలీసులు రాయలసీమకు చెందిన టీడీపీ నేత ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు సదరు నేత ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. తెలంగాణ పోలీసులు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి శివానంద రెడ్డి ఇంటికి వెళ్లారు. భూ వివాదం కేసుకు సంబంధించి వెళ్లి.. తమ వెంట రావాలని కోరారు. అయితే ఈ కేసులో తనకు నోటీసు ఇవ్వాలని శివానందరెడ్డి కోరారు.. పోలీసులు నోటీసులు సిద్ధం చేస్తుండగా.. శివానందరెడ్డి కారులో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
శివానందరెడ్డి వెళ్లిపోతున్న సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. దొరకకుండా తప్పించుకొని వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. తెలంగాణ పోలీసులు శివానందెడ్డి వాహనాలను వెంబడించకుండా ఆయన అనుచరులు గేట్లు వేసినట్టుగా సమాచారం. శివానందరెడ్డి కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తుండగా.. ఈ విషయం తెలియడంతో ఆయన ఇంటికి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.
మాండ్ర శివానందరెడ్డి హైదరాబాద్‌లో ఓ భూవివాదం కేసులో ఉన్నట్లు తెలుస్తోంది. క్రైమ్ నెంబర్ 194/2022లో శివానందరెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ఆయన్ను అదుపులోకి తీసుకోవడానికి వచ్చినట్లు చెబుతున్నారు. టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న మాండ్ర శివానందరెడ్డి.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. మరి ఈ కేసులో తెలంగాణ పోలీసులు ఎలా ముందుకు వెళతారన్నది చూడాలి.