మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో విడుదలైన వివేకం సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపింది. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి హైకోర్టును ఆశ్రయించారు. తన స్టేట్మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు సీబీఐ కోర్టులో విచారణలో ఉందని, కాబట్టి సినిమా ప్రదర్శనను ఆపేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఐ-టీడీపీ ప్రోత్సాహంతో ఈ సినిమా అన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లలో అందుబాటులో ఉందని తెలిపారు.
పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఈ సినిమా ప్రదర్శినతో పిటిషనర్ నష్టపోయే అవకాశం ఉందని లాయర్ జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇది హక్కులకు భంగం కలిగించడమే అని చెప్పారు. సెన్సార్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఈ సినిమా విడుదలయిందన్నారు. సినిమా ప్రదర్శనను ఆపేయాలంటూ తక్షణమే ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు. కేవలం రాజకీయ ప్రయోజనాలతో తెలుగుదేశం పార్టీ వెనుక ఉండి ఈ సినిమా ప్రదర్శిస్తుందని ఆరోపించారు దస్తగిరి.. తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్‌ని ప్రతివాదిగా చూపించారు. తక్షణమే ప్రతివాదులు అందరికీ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది.