ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో టీడీపీ కూటమికి 136, వైసీపీకి 21 సీట్లు.. వైరల్ అవుతున్న ఈ సర్వేలో నిజమెంత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 01, 2024, 08:07 PM

ఏపీలో ఎన్నికల కోలాహలం నెలకొంది. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలతో దూసుకెళ్తున్నాయి. ఇదే క్రమంలో ఓటరు నాడిని పసిగట్టేందుకు పలు మీడియా సంస్థలు ప్రీ పోల్ సర్వేలను సైతం నిర్వహించాయి మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సర్వేలు చేశాయి. ఈ సర్వేల ఆధారంగా ఆ పార్టీకి అన్ని సీట్లు వస్తాయని, ఈ పార్టీ ఇన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందంటూ తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికలకు సంబంధించి శ్రీ ఆత్మ సాక్షి పేరిట ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీ ఆత్మసాక్షి సర్వే పేరుతో ఉన్న స్క్రీన్ షాట్ల మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.


వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్లలో ఏముంది?


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని శ్రీఆత్మసాక్షి ప్రీపోల్ సర్వేలో తేలినట్లు ఫోటోలలో ఉంది. మే13వ తేదీ జరిగే ఎన్నికల్లో టీడీపీ కూటమికి 53.5 శాతం ఓట్లు వస్తాయని, వైఎస్సార్‌సీపీకి 41.5 శాతం ఓట్లు వస్తాయని ఉంది. 175 స్థానాలకు గానూ టీడీపీ కూటమికి 136 సీట్లు, అధికార వైసీపీకి 21 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అలాగే మరో 18 స్థానాలలో రెండుపార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని ప్రీపోల్ సర్వే అంచనా వేసింది.


ఆత్మసాక్షి సర్వే


వైరల్ అవుతున్న ఫోటోలలో వాస్తవమెంత?


అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందంటూ శ్రీఆత్మసాక్షి ప్రీపోల్ సర్వే పేరుతో వైరల్ అవుతున్న ఫోటోలు ఎడిట్ చేసినవిగా ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. శ్రీ ఆత్మసాక్షి చేసిన ప్రీపోల్ సర్వేలో అధికార వైసీపీ విజయం సాధిస్తుందని తేలింది. ఈ సర్వే ఫోటోలను ఎడిట్ చేసి వైరల్ చేసినట్లు తెలిసింది.


ఆత్మసాక్షి సర్వే


ఎలా తెలిసింది..?


2024 మార్చి 23వ తేదీన శ్రీఆత్మసాక్షి సర్వేను పబ్లిష్ చేసింది. ఆ సర్వే రిపోర్టులో ఏపీ ఎన్నికల్లో 48.5 శాతం ఓట్లతో వైసీపీ 93 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. 46.5 శాతం ఓట్లతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 50 సీట్లు గెలుచుకుంటుందని ఉంది. మరో 32 సీట్లలో హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేశారు. అయితే వైరల్ అవుతున్న ఫోటోలో ఈ సంఖ్యలను మార్చినట్లు తెలిసింది.


  ఇది తెలుసుకోవటం కోసం "MOOD OF ANDHRA PRADESH AS ON 23.03.2024." పేరుతో శ్రీ ఆత్మసాక్షి నిర్వహించిన ప్రీపోల్ సర్వే వార్తా కథనాలను కూడా పరిశీలించాం. సాక్షి పోస్ట్, తెలుగు గ్లోబల్ వంటి మీడియా సంస్థలు శ్రీ ఆత్మసాక్షి పేరుతో ప్రచురించిన కథనాలను పరిశీలించాం. అయితే వైరల్ అవుతున్న ఫోటోలలో ఉన్నవిధంగా సంఖ్యలు అందులో లేవు. వైసీపీ 93 స్థానాలలో గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. అలాగే ముఖాముఖి పోరు ఉన్న 32 స్థానాలలో టీడీపీ 19 చోట్ల, వైసీపీ 13 చోట్ల ముందంజలో ఉన్నట్లు నివేదించారు.


అలాగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా శ్రీఆత్మసాక్షి సర్వే తన అంచనాలను వెల్లడించింది. ఏపీలోని 25 ఎంపీ సీట్లలో వైఎస్సార్‌సీపీ 15 చోట్ల గెలుస్తుందని, టీడీపీ కూటమి ఐదుచోట్ల గెలుస్తుందని అంచనా వేసింది. మరో ఐదు ఎంపీ సీట్లలో హోరాహోరీ పోరు ఉంటుందని సర్వే తేల్చింది. ఈ ఐదింటిలో టీడీపీ మూడు చోట్ల, వైసీపీ 2 చోట్ల ముందంజలో ఉన్నట్లు అంచనా వేసింది.


అసలైన సర్వే నివేదికతో పోలిస్తే వైరల్ ఫోటోలలో వ్యత్యాసం ఉండటాన్ని గమనించవచ్చు. అసలు నివేదిక 13 పేజీలు ఉంటే.. వైరల్ పోస్టులో 9, 10 నంబర్ పేజీలను కలిపేశారు.ఈ పేజీలలో జిల్లాల వారీగా రాజకీయ పార్టీలకు ఎన్ని స్థానాలు వస్తాయనే వివరాలు ఉన్నాయి. అయితే వైరల్ పోస్టులలో 9, 10 పేజీలను కలిపివేయటంతో పేజీల దిగువన ఉన్న పేజీ నంబర్లలో కూడా వ్యత్యాసం ఉంది.


మార్చి 23న మాత్రమే కాకుండా అంతకుముందు కూడా శ్రీఆత్మసాక్షి సంస్థ 2024 మార్చి 5న మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సర్వే వివరాలు వెల్లడించింది. అందులో కూడా వైఎస్సార్‌సీపీదే విజయమని తేలింది.


ఆత్మసాక్షిసర్వే


ఇక వైరల్ అవుతున్న ఫోటోలపై స్పష్టత కోసం శ్రీఆత్మసాక్షిని కూడా సంప్రదించాం. టీడీపీ గెలుస్తుందంటూ అంచనా వేసే నివేదిక తమది కాదని, తమ అసలు నివేదిక వైఎస్సార్సీపీ గెలుపును అంచనా వేస్తోందని శ్రీఆత్మసాక్షి గ్రూప్ స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన గ్రాఫిక్స్ కూడా పంపింది. వైరల్ పోస్టులోని నంబర్లను డిజిటల్ సాయంతో మార్చినట్లు ఆ సంస్థ సీఈవో వీఆర్ మూర్తి తెలిపారు.


వైరల్ ఫోటోలు ఫేక్..


మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని శ్రీఆత్మసాక్షి ప్రీపోల్ సర్వే అంచనా వేసింది. ఈ సర్వే నివేదికను డిజిటల్ సాయంతో సవరించినట్లు ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. దీంతో వైరల్ అవుతున్న ఫోటోలు ఫేక్ అని నిర్ధారించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com