పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరో నేత షాకిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును బాపట్లలో కలిశారు. త్వరలో గురజాలలో జరిగే శంఖారావం సభ వేదికగా అనుచరులతో కలిసి జంగా కృష్ణమూర్తి పార్టీలో చేరనున్నారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. జంగా రాకతో పల్నాడు జిల్లాలో టీడీపీకి బలం చేకూరినట్లవతుంది అంటున్నారు.
మరోవైపు బాపట్ల పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు గెలవాల్సిందే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బాపట్లలో జరిగిన ప్రజా గళం బహిరంగ సభ అనంతరం బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. ప్రచార కార్యక్రమాలు, కూటమి నాయకుల మధ్య సమన్వయంపై దిశా, నిర్దేశం చేశారు. పార్లమెంట్ పరిధిలో మంచి స్పందన ఉందని.. ఇక్కడ కచ్చితంగా ప్రతి అభ్యర్థి గెలుపొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
బాపట్ల పార్లమెంట్ పరిధిలో కచ్చితంగా అందరూ గెలిచి తీరాలని.. పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు వైఎస్సార్‌సీపీని ఓడించాలని చాలా పట్టుదలతో ఉన్నారని.. నేతలు ప్రచారం ముమ్మరం చేయాలన్నారు. ఇక్కడ మిచౌంగ్ తుఫాన్‌తో రైతులకు చాలా నష్టం వాటిల్లిందని.. తొలుత రైతుల్ని పరామర్శించి ధైర్యం చెప్పడానికి తాను క్షేత్ర పర్యటన చేసి వారికి ఎంతో అండగా నిలిచామన్నారు. గడిచిన ఐదేళ్లలో పదిసార్లు పార్లమెంట్ పరిధిలో పర్యటించి అన్ని విధాలా ప్రజలకు భరోసాగా నిలిచామన్నారు. వారి ఓట్లు పొందడానికి అభ్యర్థులు ఇంటింటికి తిరగాలని సూచించారు. సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని సూచించారు.
వైఎస్సార్‌సీపీ అరాచకాలు సృష్టించి గెలుపొందాలని చూస్తారు.. అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలకు సూచించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మూడు పార్టీలు సమన్వయంతో పని చేయాలని.. ఏవైనా ఇబ్బందులు ఉంటే స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలన్నారు. మరో వారం రోజుల్లో జిల్లాకు వస్తానని.. అప్పటికి అభ్యర్థులు ఇంకా జనాల్లోకి వెళ్లాలన్నారు. ప్రతి అభ్యర్థికి ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంటుందో అంచనా వేస్తామని.. దాన్ని దృష్టిలో ఉంచుకుని పని చేయాలన్నారు. పోలింగ్ తేదీ వరకు కష్టించి పని చేస్తే విజయం సొంతమవుతుందన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఆ పార్టీకి గెలుపు అవకాశాలు ఏ మాత్రం లేవన్నారు. పార్టీకి చాలా సానుకూల వాతావరణం ఉందని అభ్యర్థులతో పేర్కొన్నట్లు సమాచారం. ఈ 40 రోజులు చాలా కీలకమని.. నేతలు కష్టపడి పనిచయాలన్నారు.