ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది.. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయ్యింది. జనసేన పార్టీ మాత్రం పెండింగ్‌లో ఉన్న రెండు సీట్లకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అయితే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేన పార్టీకి దక్కడంతో.. అక్కడ అభ్యర్థి ఎవరు అనే అంశంపై చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేరుతో సర్వేలు చేయించింది.. కానీ ఓ అంచనాకు రాలేకపోతోంది. ఈ క్రమంలో సరికొత్త ప్రచారం జరుగుతోంది. అభ్యర్థిని ఫైనల్ చేశారని.. టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరి టికెట్ దక్కించుకుంటారనే చర్చ నడుస్తోంది.
అవనిగడ్డ నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లు ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బుద్ధప్రసాద్ సోమవారం కలిసి, పార్టీలో చేరనున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా జనసేనకు అవనిగడ్డ స్థానం కేటాయించడంతో సరైన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్ గట్టిగా ప్రయత్నించారు. కొన్ని పేర్లు తెరపైకి వచ్చినా చివరికి మండలివైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
మండలి బుద్ధప్రసాద్ 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలడంతో.. ఈ నియోజకవర్గంపై గట్టి పట్టు ఉంది. ఆయనకు టికెట్ ఇస్తేనే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయని జనసేన పార్టీ భావించినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం కూటమి లోక్‌సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి కూడా బుద్ధప్రసాద్‌కు జనసేన టికెట్ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే మండలి బుద్ధ ప్రసాద్ ఎంపికపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.