ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. ఇప్పటికే 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సోమవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఈసారి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు కస్టడీకి అడగకపోవడంతో ఆయనకు కోర్టు.. జ్యుడీషియల్ కస్టడీకి విధించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ ఢిల్లీ లిక్కర్ కేసు మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్‌లతోపాటు కేజ్రీవాల్‌ను కూడా తీహార్ జైలుకు తరలించనున్నారు. తీహార్ జైలులో ఈ నెల 15 వ తేదీ వరకు కేజ్రీవాల్ ఉండనున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు తీహార్ జైలులో ఏ సెల్‌ను కేటాయించారు. ఆయన దినచర్య ఎలా ఉండనుంది. ఆయనకు ఎలాంటి వసతులు సమకూర్చనున్నారనేది ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
జైలులోని ఇతర ఖైదీల దినచర్య లాగానే అరవింద్ కేజ్రీవాల్‌కు దినచర్య కూడా ఉండనుంది. ఉదయం 6.30 గంటలకు నిద్రలేవడంతో కేజ్రీవాల్‌కు రోజు ప్రారంభం కానుంది. జైలులో ఉన్న నిందితులు, ఖైదీలకు బ్రేక్‌ఫాస్ట్‌గా టీ, బ్రెడ్ ముక్కలు ఇస్తారు. ఆ తర్వాత ఒకవేళ కేసు విచారణ ఉంటే కేజ్రీవాల్‌ను కోర్టుకు తీసుకువెళ్తారు. లేకపోతే ఆయన తరఫున లాయర్ల బృందంతో కేజ్రీవాల్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత 10.30 నుంచి 11 గంటల మధ్య మధ్యాహ్న భోజనం ఉంటుంది. ఇక లంచ్‌లో పప్పు, సబ్జీ, 5 రొట్టెలు లేదా అన్నం వడ్డిస్తారు. లంచ్ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి ఖైదీలను సెల్‌లోనే ఉంచుతారు. ఆ తర్వాత 3.30 గంటలకు టీ, 2 బిస్కట్లు ఇస్తారు. అనంతరం 4 గంటలకు లాయర్లను కలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక సాయంత్రం 5.30 గంటలకు ఎర్లీ డిన్నర్ ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి కేజ్రీవాల్‌ను జైలు గదిలోనే ఉంచుతారు.
ఇక తీహార్ జైలులో టీవీ చూసే సౌకర్యాన్ని కేజ్రీవాల్‌కు కల్పించారు. వార్తలు, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, సహా మొత్తం 20 ఛానెల్స్ చూసే అవకాశం ఇచ్చారు. 24 గంటలు మెడికల్ సిబ్బంది కేజ్రీవాల్‌కు అందుబాటులో ఉండనున్నారు. కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్ కావడంతో ఆయనకు తీహార్ జైలులో రెగ్యులర్‌గా మెడికల్ చెకప్‌లు ఉంటాయి. ఇక వారంలో రెండు సార్లు కుటుంబ సభ్యులను కలుసుకునే వీలు కేజ్రీవాల్‌కు కోర్టు కల్పించింది. ఎవరెవరు కుటుంబ సభ్యులు కేజ్రీవాల్‌ను కలుస్తారు అనేది నిర్ధారించుకున్న తర్వాతే తీహార్ జైలు భద్రతా సిబ్బంది వారికి లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. తీహార్ జైలులో మొత్తంగా 16 జైళ్లు ఉన్నాయి. వాటిలో 20 వేల మంది ఖైదీలు, విచారణ ఖైదీలు ఉండేందుకు అవకాశం ఉంది.
తీహార్ జైలులోని జైల్ నెంబర్-2 లో కేజ్రీవాల్ ఒక్కరినే ఉంచనున్నారు. ఇప్పటికే ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా జైల్ నెంబర్-1 లో, ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ జైల్ నెంబర్-7లో , ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జైల్ నెంబర్-5లో ఉంచారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలులోని జైల్ నెంబర్-6 మహిళా జైలులో ఉన్నారు.