సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వార్తలు, ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో చాలా వరకు నిజాలు ఉండగా.. మరికొన్ని అబద్ధాలు, ఫేక్ ఉంటాయి. ఇక మరికొన్ని వార్తలు అయితే ఒక ప్రదేశంలో జరిగితే మరో దగ్గర జరిగినట్లు పేర్కొంటూ ఉంటారు. ఫోటోలు, వీడియోలు కూడా ఒక దగ్గర ఎప్పుడో జరిగిన వాటిని తిరిగి ఇప్పుడు.. మరో ప్రాంతంలో జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే అవే నిజమని నమ్మిన నెటిజన్లు వాటిని షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటిదే ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ చేయగా.. అసలు విషయం బయటికి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
వైరల్ ఫోటో ఏంటి?
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీగా జనం వచ్చినట్లు ఉన్న ఒక ఫోటో ట్విటర్‌లో పోస్ట్ చేశారు. @bloggingpanda87 అనే అకౌంట్ నుంచి ఆ ఫోటో పోస్ట్ అయింది. దానికి ఆదివారం ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీ అంటూ క్యాప్షన్ కూడా ఉంది.
నిజం
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటో ప్రస్తుతం జరిగింది కాదని స్పష్టం అవుతోంది. అది గతంలో జరిగిన ఓ ర్యాలీకి సంబంధించిన ఫోటో అని.. దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఇప్పుడు జరిగినట్లు ప్రచారం చేస్తున్నట్లు తేలింది. అది అసలు ఇప్పుడు జరిగింది కాదని న్యూస్ చెకర్ అనే వెబ్‌సైట్ ధ్రువీకరించింది.
వెరిఫికేషన్ అండ్ మెథడాలజీ
గూగుల్ లెన్స్ ద్వారా ఆ వైరల్ ఫోటోను సెర్చ్ చేయగా పీపుల్స్ డెమోక్రసీ వెబ్‌సైట్‌కు చెందిన ఒక ఆర్టికల్ 2019 ఫిబ్రవరి 10 వ తేదీన ప్రచురించినట్లు స్పష్టం అవుతోంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో 2019 ఫిబ్రవరి 3 వ తేదీన లెఫ్ట్ ఫ్రంట్ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో భారీగా జనం తరలివచ్చారు. కొన్ని అంచనాల ప్రకారం 10 లక్షలకు పైగా జనం బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌కు వచ్చినట్లు వార్తలు ఉన్నాయి. బెంగాల్‌లో ప్రత్యామ్నాయ విధానాలు, రాజకీయాల కోసం 5 వామపక్ష పార్టీలు ఈ ర్యాలీకి పిలుపునిచ్చారు.
కోల్‌కతాలో 2019 లో జరిగిన ర్యాలీకి సంబంధించిన ఫోటో
కోల్‌కతా బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరిగిన ఆ ర్యాలీకి సంబంధించిన ఫోటోను ప్రస్తుతం వైరల్ చేసి.. అది ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీకి సంబంధించిందని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కోల్‌కతాలో లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ అని ధ్రువీకరించారు. ఇదే విషయాన్ని చాలా మీడియా సంస్థలు ప్రచురించాయి. దీంతో న్యూస్ చెకర్ ఫ్యాక్ట్ చెక్ సంస్థ కూడా అదే విషయాన్ని ధ్రువీకరించింది.
తీర్పు
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీది కాదని.. 2019 ఫిబ్రవరి 3 వ తేదీన కోల్‌కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ర్యాలీకి సంబంధించిందని తేల్చడం జరిగింది.