‘సీఎం జగన్ నిన్న నన్నో మాట అన్నారు. నన్ను పశుపతి అని సంభోదించారు. ఆ మాట విని నవ్వుకున్నాను. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే పరమశివుడు. గరళాన్ని గొంతులో పెట్టుకుని మానవాళిని కాపాడాడు. అందుకే నేను శివావతారం ఎత్తాను’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బుధవారం సాయంత్రం కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో, రాత్రికి రామచంద్రపురం ద్రాక్షారామలో జరిగిన ప్రజాగళం సభల్లో పాల్గొన్నారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఎన్ని అవమానాలైనా భరిస్తానని చెప్పారు. రాష్ట్రం లో జగన్‌రెడ్డి ఒక్కడే బాగుంటే చాలు.. ఇంకా ఎవ్వరూ బాగుపడకూడదనేది ఆయన ఉద్దేశమని ఆక్షేపించారు. 2014లో తండ్రి మరణాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయం చేశాడని.. 2019లో బాబాయి హత్యను రాజకీయం చేశాడని.. ఇప్పుడేమో వృద్ధుల పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. బాబాయిని హత్య చేసిన హంతకులెవరో చెప్పి జగన్ ఓట్లడగాలని డిమాండ్ చేశారు. గొడ్డలి గుర్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీచేయాలని ఎద్దేవాచేశారు. జగన్ చర్యలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందన్నారు. ఫేక్ ప్రచారాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వకుండా వేధిస్తున్నాడని విమర్శించారు. ఐదేళ్లలో ఎన్నో దాడులు, ఎన్నెన్నో దోపిడీలు చేశారని ధ్వజమెత్తారు. తనతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కూడా ఎన్నో ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురిచేశారని.. అయి నా తాము భయపడలేదని.. అరెస్టులకు కూడా సిద్ధపడ్డామని చెప్పారు.