ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల వేళ నకిలీ రూ.500 నోట్ల కలకలం.. వాటిని ఎలా గుర్తించాలి? ఈ 10 విషయాలు తెలుసుకోండి

national |  Suryaa Desk  | Published : Thu, Apr 04, 2024, 10:40 PM

సార్వత్రిక ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా నకిలీ నోట్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.25 లక్షలు విలువైన నకిలీ నోట్లు పట్టుకున్నారు పోలీసులు. వాటిని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించారు. అయితే, ఇలాంటి వార్తలు తరుచుగా వెలువడుతూనే ఉన్నాయి. దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో నకిలీ నోట్లను పట్టుకుంటున్నారు అనే వార్త వింటూనే ఉన్నాయి. మరి ఈ నకిలీ నోట్లు మన వరకు వస్తే ఏం చేయాలి? మార్కెట్ ఉన్న నకిలీ రూ.500 నోట్లను ఎలా గుర్తించాలి? ఒరిజినల్ నోట్లకు ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటి? అనేది ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. దొంగ నోట్లు ముద్రించేవారు చిన్న మార్కెట్లను టార్గెట్ చేసుకుని నోట్లను మార్చుతున్నట్లు సమాచారం. కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాలు అయితే ఎవరూ గుర్తుపట్టరని వాటిల్లోకి ఈ నకిలీ నోట్లను తీసుకొస్తున్నారటా. అందుకే రూ.500 నకిలీ నోట్లను గుర్తించేందుకు వాటికి ఫీచర్లు తెలుసుకుందాం. 10 ముఖ్యమైన కరెన్సీ ఫీచర్లు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని బ్యాంకింగ్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.


సెక్యూరిటీ థ్రెడ్


రూ.500 కరెన్సీ నోటుపై కొన్ని చిహ్నాల ఆధారంగా నకిలీ నోటును గుర్తించవచ్చు. ప్రధాన ఫీచర్ లో నోటుపై కనిపించే సెక్యూరిటీ థ్రెడ్ ఒకటి. నోటును కంటికి ఎదురుగా పట్టుకుని చూసినట్లయితే.. నోటు మధ్యలో గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది కనిపిస్తుంటుంది. అలాగే కొంచెం వంచి చూస్తే అది నీలం రంగులోకి మారుతుంది. ఎదురుగా పట్టుకున్నప్పుడు ఆకు పచ్చ రంగులో ఉన్న థ్రెండ్, 45 డిగ్రీల కోణంలోకి వంచినప్పుడు బ్లూ రంగులో మారుతుంది. ఈ మార్పు నకిలీ కరెన్సీ నోట్లలో కనిపించదు.


లాటెంట్ ఇమేజ్ 


రూ.500 కరెన్సీ నోటు ఎడమ వైపున కింది భాగంలో మీకు ఓ ఇమేజ్ కనిపిస్తుంది. దీనినే లాటెంట్ ఇమేజ్ అని అంటారు. దాని లోపల ఏముందో స్పష్టంగా కనిపించదు. మహాత్మా గాంధీ- 2005 కరెన్సీ నోట్ల సిరీస్‌లో విడుదల చేస్తున్న రూ.100, అంత కంటే ఎక్కువ విలువైన నోట్లపై ఈ ఫీచర్ ముద్రిస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నోటు ఎడమ వైపు కింద భాగంలోని పట్టీ లోపల నోటు విలువ సంఖ్యా రూపంలో ఉంటుంది. ఆ పట్టీపై వెలుతురు పడేటట్లు చేస్తే లాటెంట్ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది.


సీ త్రూ రిజిస్టర్


నోటుకు ఎడమ వైపు 500 నంబర్ సగమే ముద్రించారా అనేలా మీకు కనిపిస్తుంది. దీనికి వెనుక భాగంలోనూ అలాగే కనిపిస్తుంది. వెలుతురులో పెట్టి చూస్తే 500 సంఖ్య మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని సీ త్రూ రిజిస్టర్ ఫీచర్ అని అంటారు.


బ్లీడ్ లైన్స్ 


రూ.500 కరెన్సీ నోటుకి ఇరువైపులా నల్లని లైన్స్ ఐదు చొప్పున ఉంటాయి. వీటినే బ్లీడ్ లైన్స్ లేక బ్లీడ్ మార్క్స్ అని అంటారు. ఈ లైన్స్‌ చేతితో తాకితే ఉబ్బెత్తుగా ఉంటాయి. ఈ లైన్స్ నోటు విలువ తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. ఐదు లైన్లు ఉన్నాయంటే రూ.500 అని, 4 లైన్లు మాత్రమే ఉంటే రూ.100 నోటు, 4 బ్లీడ్ లైన్ల మధ్యలో రెండు చిన్న సర్కిల్స్ ఉన్నట్లయితే రూ.200 నోటు అని గుర్తించవచ్చు.


ఇంటాగ్లియో ప్రింటింగ్


నోటుకు మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం, రిజర్వ్ బ్యాంక్ సీల్ ఉంటుంది. అలాగే కుడి వైపు అశోక స్తూపం ఉంటుంది. నోటుపై కుడి, ఎడమ చివరి భాగంలో ఉండే బ్లీడ్ లైన్లను ఇంటాగ్లియో ప్రింటింగ్ లేక రైజ్డ్ ప్రింటింగ్ అని అంటారు. ఈ విధానంలో ప్రింట్ చేసిన నోట్లను తాకినప్పుడు ఉబ్బెత్తుగా ఉన్నట్లు తెలుస్తాయి.


వాటర్ మార్క్, ఎలక్ట్రోటైప్ వాటర్‌మార్క్


సెక్యూరిటీ థ్రెడ్ పక్కనే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది. దాని కింద ఆర్‌బీఐ ఎంబ్లమ్ కనిపిస్తుంది. ఆ పక్కన ఖాళీగా ఉండే భాగంలో పరిశీలించి చూసినట్లయితే మహాత్మ గాంధీ గారి వాటర్ మార్క్ ఉంటుంది. ఈ చిత్రాన్ని ఎలక్ట్రో టైప్ వాటర్ మార్క్ అని అంటారు. ఇది నోటుపై చెక్కినట్లుగా కనిపిస్తుంది. గాంధీ చిత్రం వాటర్ మార్క్ పక్కనే, డినామినేషన్ తెలిపే సంఖ్య కూడా ఉంటుంది.


న్యూ నంబరింగ్ ప్యాటర్న్


2015 తర్వాత ప్రింట్ చేస్తున్న నోట్లపై కుడి వైపు కింద ఉన్న సంఖ్యలో ఒక సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. ఎడమ నుంచి కుడికి చూస్తే సైజు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. అయితే నంబర్ కు ముందు ఉండే మూడు ఇంగ్లీష్ అక్షరాల సైజు పెరగదు. అవన్నీ ఒకే సైజులో కనిపిస్తాయి. ఆ తర్వాత వచ్చే ఆరు నంబర్లలో ఒక్కో సంఖ్య సైజు కుడివైపు పెరుగుతూ వస్తుంది. ఈ నంబర్ ఏ రెండు నోట్లకు ఒకేలా ఉండదని గుర్తుంచుకోవాలి.


ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్ 


కరెన్సీ నోటు కుడి వైపు రిజర్వ్ బ్యాంక్ ఎంబ్లమ్‌, అశోక స్తంభానికి మధ్యలో రూ. 500 అనే సంఖ్య ఉంటుంది. కంటికి నోటును ఎదురుగా పెట్టుకుని చూసినప్పుడు ఈ నంబర్ ఆకుపచ్చ రంగులో, సమాంతరంగా పట్టుకుంటే బ్లూ రంగులో కనిపిస్తుంది. ఈ సంఖ్య ప్రింట్ చేసేందుకు ఆప్టికల్లీ వేరియబుల్ ఇంక్ వినియోగిస్తారు. అందుకే ఆ నంబర్ రంగులు మారతుంది.


నోటును వెనుక వైపు..


కరెన్సీ నోటు వెనకాల ఎడమ వైపు కింది భాగంలో నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది. దానికి పక్కన స్వచ్ఛ భారత్ లోగో, నినాదం సైతం ఉంటాయి. ఆ పక్కనే లాంగ్వేజ్ ప్యానెల్ కనిపిస్తుంది. ఇందులో తెలుగు భాషతో పాటు 15 భాషల్లో నోటు విలువ రాసి ఉంటుంది. మరోవైపు.. రూ. 500 కరెన్సీ నోటుపై ఎర్రకోట, రూ. 200 కరెన్సీ నోటుపై సాంచీ స్తూపం, రూ. 100 కరెన్సీ నోటుపై రాణి కా వావ్ ఇమేజెస్ కనిపిస్తాయి.


బ్యాంకుకు వెళ్లి చెక్ చేసుకోవచ్చు


దొంగ నోటు అని అనుమానం వస్తే బ్యాంకుకు వెళ్లి చెక్ చేయవచ్చు. బ్యాంకు సిబ్బంది పరిశీలించి నకిలీదో, ఒరిజినల్‌దో మీకు చెప్తారు. ఒక వేళ నకిలీ నోటు అయినట్లయితే దానిని తీసుకుని, ఎంత విలువైన నోటును వారు తీసుకున్నారో ఒక రసీదు ఇస్తారు. ఆ నకిలీ నోటు ఎవరి మనకు ఇచ్చారో వారికి ఆ రసీదు చూపించి.. నకిలీ నోటని చెప్పవచ్చు. అయితే ఆ రసీదుకు ఎలాంటి మారక విలువ ఉండదని గుర్తుంచుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com