కలల ఇల్లు సొంతం చేసుకునేందుకు ప్రజలు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడటం లేదు. మంచి సౌకర్యాలు ఉంటే.. ధర రూ. కోటి అయినా.. అంతకుమించైనా పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నమోదైన విక్రయాలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. గడిచిన 3 నెలల్లో జరిగిన మొత్తం ఇళ్ల అమ్మకాల్లో వీటి వాటానే ఏకంగా 40 శాతం కావడం గమనార్హం. ఇదే సమయంలో రూ. 50 లక్షల్లోపు ఇళ్ల అమ్మకాలు మాత్రం క్షీణించాయని.. దిగ్గజ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ తన లేటెస్ట్ రిపోర్టులో వెల్లడించింది. రూ. కోటికిపైగా రేట్లు కలిగిన ఇళ్ల విక్రయాలు కిందటి సంవత్సరంలో Q1 లో 29 శాతం కాగా.. క్యూ2లో ఇది 31 శాతంగా.. క్యూ3లో 35 శాతంగా ఉంది. ఇదే Q4లో 39 శాతానికి పెరిగినట్లు తెలిపింది నివేదిక.
జనవరి- మార్చి మధ్య దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 86,345 యూనిట్స్ అమ్ముడైనట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. 2023 చివరి త్రైమాసికంలో అత్యధికంగా 89,845 యూనిట్లు అమ్ముడుబోగా.. ఈ త్రైమాసికంలో నమోదైందే రెండో అత్యధికం.
మొత్తం విక్రయాల్లో రూ. కోటికిపైగా ధర ఉన్న 34,895 గృహాలు అమ్ముడుబోయినట్లు నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ తెలిపింది. సంఖ్యాపరంగా కిందటేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇవి 51 శాతం ఎక్కువ. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 50 లక్షల్లోపు ఉన్న ఇళ్లు 25,714 యూనిట్లు అమ్ముడవగా.. ఈసారి ఆ సంఖ్య 23,026గా నమోదైంది. మొత్తం అమ్మకాల్లో ఈ వాటా 27 శాతంగా ఉంది.
ఇక రూ 50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య విలువ ఉన్న ఇళ్ల అమ్మకాలు 5 శాతం (28,424 యూనిట్లు) మేర తగ్గిపోయాయి. గతేడాది 38 శాతంగా ఉన్న వీటి విక్రయాలు 33 శాతానికి తగ్గాయి. ఇది బలమైన డిమాండ్‌ను సూచిస్తుందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఎండీ, ఛైర్మన్ శిశిర్ బాలాజీ చెప్పారు. ఇంకా.. దీర్ఘకాలిక పెట్టుబడులపై సుముఖంగా ఉన్నారన్నది తెలియజేస్తుందన్నారు. రూ. కోటికిపైగా విలువ కలిగిన ఇళ్ల అమ్మకాల్లో దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఈ ప్రాంతంలో జనవరి- మార్చి మధ్య 10,558 యూనిట్లు అమ్ముడుబోయాయి. తర్వాత ముంబై (7401), హైదరాబాద్ (6112) ఉన్నాయి.