అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌లోని జమ్మూ కశ్మీర్‌లో నిరసనకారులు ‘అల్లాహ్ అక్బర్, ఖమేనీ రెహ్‌బర్ (దేవుడు గొప్పవాడు.. ఖమేనీ నాయకుడు)’ అనే నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఖమేనీ మృతితో శోకసంద్రంలో మునిగిపోయి వారు.. తమ ఛాతీని లయబద్ధంగా కొట్టుకుంటూ వీధుల్లో చేస్తున్న కవాతులు దుఃఖం, కోపం కలగలిసిన వెల్లువలా ప్రవహిస్తోంది. ఇలాంటి దృశ్యాలు మొహర్రం ఊరేగింపులో కనిపిస్తున్నాయి. కర్బలా యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేస్ బలిదానాన్ని గుర్తుచేసుకుంటూ సంతాపం తెలిపే మొహర్రం ఊరేగింపులు, అషురాలోని అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. దీంతో ఖమేనీ షియా వర్గం ముస్లింలకు ఎందుకంత ముఖ్యమనే చర్చ జరుగుతోంది.
ఖమేనీ పూర్తి పేరు ఆయతుల్లా సయ్యద్ అలీ హుస్సేని ఖమేనీ. ‘హుస్సేని సయ్యద్’లు అంటే మహ్మద్ ప్రవక్త వంశానికి చెందినవారుగా భావిస్తారు. షియాలు ఇమామ్‌లను ఆరాదిస్తారు. ఖమేనీ సైతం ఇమామ్ కావడంతో ముస్లిం పండితులు మార్జా అల్-తక్లిద్ (అనుకరణకు మూలం, వాలి అల్ ఫకీహ్ (అంటే న్యాయ సంరక్షకుడు)ను కోల్పోయామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఖమేనీ హత్య, కర్బలా యుద్ధంలో ఇమామ్ హుస్సేన్ బలిదానం మధ్య పోలికలు ఉన్నాయని, ఇరాన్‌లో కర్బలా పునరావృతమైందని షియాలు అంటున్నారు.
‘‘అతను (ఖమేనీ) తల్లిదండ్రుల కంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి... ఇది పూడ్చలేని నష్టం. మా ఇమామ్ అమరులయ్యారు. ఆయన ఇస్లాంకు అతిపెద్ద స్తంభం’ అని ఒక మహిళ కన్నీటి పర్యంతమైంది. ఆమె భర్త అజాజ్ రిజ్వి సైతం తన బాధను వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఖమేనీ బలిదానం తర్వాత ఆయన ఆలోచనను వారు చంపలేరు’ అని ఆయన అన్నారు.
‘‘తన పూర్వీకుల జాడలో నడిచిన ఇమామ్ ఖమేనీ, ఆయన కుటుంబసభ్యులను హత్య చేశారు... న్యాయం కోసం, గాజాలో అణచివేతకు, హింసకు గురైన ప్రజల కోసం ఆయన నిలబడ్డారు’’ అని మరో ఆందోళనకారుడు అన్నారు.
ఇక, ఖమేనీ తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే 1980లో కశ్మీర్‌ను సందర్శించారు. ఆ సమయంలో సున్నీ, షియాల మధ్య ఐక్యతను పెంపొందించడానికి కృషిచేశారు. శ్రీనగర్‌లోని జామియా మసీదులో సున్నీలతో కలిసి ఆయన ప్రార్థనలు చేసి, ప్రసంగించారు. 1989లో తన తండ్రి ఆయతుల్లా రౌహల్లా ఖోమోని మరణంతో ఇరాన్ సుప్రీం నేతగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయనను షియా ముస్లింలు ఇమామ్‌గా అనుసరిస్తున్నారు. నిజానికి, అనుచరులు ఖుమ్‌లను (వార్షిక పొదుపులో దాదాపు 20% మతపరమైన కార్యక్రమాలకు కేటాయింపు) మార్జా (నాయకుడు అని అర్థం) లేదా ఆయన ఎంచుకున్న ప్రతినిధికి చెల్లిస్తారు.
ఓ షియా పండితుడు మాట్లాడుతూ.. ‘‘పన్నెండు మంది ఇమామ్‌లలో చివరివాడైన ఇమామ్ మహదీకి ఆయతుల్లాను ప్రతినిధిగా నమ్ముతాం.. ఆయన శాంతిని స్థాపించడానికి, ఇస్లాంను రక్షించడానికి యుగం చివరలో ఉద్భవించారని మా నమ్మకం.. ఆయన మరణం ఒక సాధారణ నాయకుడి మరణం కాదు. ఇది మా విశ్వాసానికి సంబంధించింది’ అని ఆయన అన్నారు.
శ్రీనగర్ ఎంపీ అగా రౌహల్లా మహదీ మాట్లాడుతూ.. ఆయన మరణంపై తమ ఆగ్రహానికి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. అధికారానికి లొంగకుండా ప్రతిఘటన అనే వ్యవస్థకు ఆయన ప్రాతినిధ్యం వహించారు.. సామ్రాజ్యవాద శక్తులు, అమెరికా, ఇజ్రాయెల్‌కు లొంగిపోయిన వారికి భిన్నంగా గాజా విషయంలో ఆయన వైఖరి ఇందుకు ఉదాహరణ’ అని ఆయన అన్నారు. ‘అమెరికాతో చర్చలు జరిపి, మిగతా అరబ్ నాయకుల మాదిరి ప్రశాంతంగా ఉండొచ్చు.. కానీ, ఖమేనీ వేరే మార్గాన్ని ఎంచుకున్నారు... సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా నిలబడి, అణచివేతను ఎదుర్కొంటున్న ప్రజలకు ఆయన ఏకైక ఆశాకిరణం.’ అని మహదీ వ్యాఖ్యానించారు.
షియా ముస్లిం వ్యక్తిగత జీవితాల్లో మార్పులు తీసుకురావడంతో ఖమేనీ కీలక పాత్ర పోషించారని ముజతాబా అలీ అనే మరో నిరసనకారుడు తెలిపారు.‘‘ఆరాధనకు సంబంధించి మతపరమైన శాసనాలు/ నిర్ణయాలు జారీ చేయడం నుంచి లావాదేవీలు, నీతి, కుటుంబ చట్టం వరకు, రోజువారీ వ్యవహారాలు షరియాకు లోబడి ఉంటాయి. దీనికి ప్రతీ షియా ముస్లిం కట్టుబడి ఉంటారు’’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa