ప్రపంచంలోని టాప్-10 కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. భారత్ లో అత్యంత ధనవంతుడిగా మరోసారి నిలిచారు. తాజాగా ఫోర్బ్స్ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితా విడుదలైంది. ఈ లిస్ట్ ప్రకారం.. 116 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానంలో నిలిచారు. 2023లో ఆయన సంపద 83.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక భారత్ సంపన్నుల్లో రెండో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ లిస్ట్‌లో 17వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద 47.2 బిలియన్ డాలర్ల నుంచి 84 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఫోర్బ్స్ 2024 రిచ్ లిస్ట్ లో 2,781 మంది సంపన్నులు చోటు దక్కించుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య ఏకంగా 141 పెరిగింది. అంటే కొత్తగా 141 మంది ఈ జాబితాలోకి చేరారు. వీరి మొత్తం సంపద 2023 ఏడాదితో పోలిస్తే 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగింది. దీంతో 2024లో కుబేరుల మొత్తం సంపద 14.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. జాబితాలో మూడింట రెండొంతుల మంది సంపద వృద్ధి చెందగా.. నాలుగింట ఒక వంతు సంపన్నుల సంపద తగ్గింది.
వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ గా బెర్నార్డ్..
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఫ్రాన్స్ లగ్జరీ వస్తువల తయారీ దిగ్గజం ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నాల్డ్ ఆర్నాల్ట్ మరోసారి నిలిచారు. 233 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఎలాన్ మస్క్ 195 బిలియన్ డాలర్లతో రెండో స్థానానికి పడిపోయారు. ఇక అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 194 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉండగా.. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 177 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.
డబుల్ సెంచరీ చేసిన భారతీయులు..
ఫోర్బ్స్ 2024 రిచ్ లిస్ట్‌లో అమెరికా నుంచి 813 మంది చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత చైనా నుంచి 473 మంది బిలియనీర్లుగా ఉన్నారు. అలాగే భారత్ నుంచి ఈసారి 31 మంది కొత్తగా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. దీంతో ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ కుబేరుల సంఖ్య 200కు చేరింది. అందులో హెచ్‌సీఎల్ టెక్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ 36.9 బిలియన్ డాలర్లతో 39వ స్థానంలో ఉన్నారు. జిందాల్ గ్రూప్ సావిత్రి జిందాల్ కుటుంబం 33.5 బిలియన్ డాలర్లతో 46వ స్థానంలో ఉంది. సన్ ఫార్మా దిలీప్ సంఘ్వి 26.7 బిలియన్ డాలర్లతో 69వ స్థానంలో నిలిచారు. సైరస్ పూనావాలా 90వ స్థానం, కుషాల్ పాల్ సింగ్ 92వ స్థానం, కుమార్ బిర్లా 98వ స్థానం దక్కించుకున్నారు.