ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు వైయస్ఆర్‌సీపీలో చేరుతున్నారని నెల్లూరు పార్లమెంట్ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న తప్పిదాలే ఆ పార్టీని కబళించి వేస్తున్నాయన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. తాజాగా టీడీపీకి రాజీనామా చేసి మాజీ జడ్పీటీసీ రుక్మిణి, మాజీ ఎస్సీ కమిషన్ మెంబర్ రవీంద్ర వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా విజయసాయి మాట్లాడుతూ.. ‘1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు అందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైయస్ఆర్‌సీపీ లో చేరుతున్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు ఆకర్షితులు అవుతున్నారు. వాలంటీర్ వ్యవస్థపై ఫిర్యాదులు చేసి.. పెన్షన్‌దారులకు వారిని దూరం చేయడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం. చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు తెలుగుదేశం పార్టీనే కబళించి వేస్తున్నాయి. వాలంటీర్ మీద ఆధారపడిన ప్రతీ కుటుంబం చంద్రబాబు కుట్రలను వ్యతిరేకిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన అందరికీ ప్రాధాన్యత ఇస్తామన్నారు.