వివక్ష లేని పాలనను అందించాం.. మీ అందరి మన్ననలూ అందుకున్నామని, చంద్రబాబుకు అధికారం ఇస్తే అధోగతి తప్పదని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. పలు వీధుల్లో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకత్వంతో కలియదిరిగారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వివక్ష లేని పాలనను అందించాం.. మీ అందరి మన్ననలూ అందుకున్నాం. ఇదే ఒరవడి కొనసాగాలంటే మీరంతా మరోసారి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం అందుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ఒకవేళ విపక్ష నేత చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రానికి అధోగతి తప్పదు. ఆయన అనుభవంతో మన ప్రాంతానికి తీసుకువచ్చిందేమీ లేదు. విభజన తరువాత కేంద్రం కేటాయించిన సంస్థలలో ఒక్కటంటే ఒక్కటి కూడా మన ప్రాంతానికి తీసుకుని రాలేకపోయిన అసమర్థత ఆయనిది. ఆ రోజు విభజన లో భాగంగా మన ప్రాంతం పూర్తిగా నష్టపోయింది. విభజిత ఆంధ్రాకు పరిహారంగా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను తనకు చెందిన ప్రాంతాలలో ఏర్పాటు చేసుకున్నారే తప్ప.. ఉత్తరాంధ్రకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన కేటాయింపు చేసిన దాఖలాలు లేవు. ఏమంటే అనుభవం అంటారు. అనుభవంతో వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి దృష్టి సారించిన సందర్భాలు ఏమయినా ఉన్నాయా ? ఉంటే చెప్పండి ? ఆ రోజు కేంద్రం కేటాయించిన సంస్థలలో ఒక్కటంటే ఒక్కటి మా ప్రాంతానికి కేటాయించేందుకు కూడా మీకు మనసు రాలేదు కదా..మీ అనుభవం కారణంగా వ్యాపారులు లబ్ధి పొందుతారు. మీ అనుభవం కారణంగా మీరు వ్యాపారం చేసుకుని వ్యవహారం చక్కదిద్దుకుని బాగుపడతారు. అంతే తప్ప.. మీ అనుభవం కారణంగా మా ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పడం కాదు నిరూపించండి నమ్ముతాం.
విడిపోయిన రాష్ట్రంలో మొదటి ఐదేళ్లూ (2014 - 2019) చంద్రబాబు పాలనను చూశారు. తరువాత ఐదేళ్లూ (2019 - 2024) జగన్ పాలన చూశారు, రాష్ట్ర సంపదను అతను తన చుట్టూ ఉన్న వారికి పంచి పడుతూ,ప్రజల ఆమోదం లేని ప్రాంతాన్ని రాజధాని నిర్మాణానికి పూనుకోవడం,ప్రభుత్వంలో బ్రోకర్స్ నీ తయారు చెయ్యడం,రాజ్యాంగానికి అతితం అయిన శక్తులను తయారు చేయడం, వారిని ప్రోత్సహించడం అన్నవి ఆ రోజు చేశారు. ఆ ఐదేళ్లూ విడ్డూరమైన చంద్రబాబు పరిపాలన చూశారు. ఆయన మీద కోపంతో, నాటి పాలనపై విసుగు చెంది, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని వైనంపై విరక్తి చెంది తరువాత వచ్చిన ఎన్నికల్లో (2019 ఎన్నికల్లో ) 151 సీట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఇచ్చారు. ఈ ఐదేళ్ల పాలనలో ఎన్నో సంస్కరణలు చూశారు. పాలనను మరింత స్థానికం చేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చాం. అలానే వలంటీరు వ్యవస్థ ద్వారా మీ చెంతకే పలు సేవలను అందించగలిగాం. కరోనా లాంటి విపత్కర సమయాల్లో కూడా మీరెక్కడా ఇంటి నుంచి బయటకు రాకుండా మీ దగ్గరకే తొమ్మిది నెలల పాటు నిరాటంకంగా సరకులు పంపించాం. అందించాం. మీరు ఈ సంక్షేమ పాలనను చూశారు. మీరు మేం చేసిన అభివృద్ధిని చూశారు. ఆ రోజు ఏనాడయినా ప్రజల డబ్బు ప్రజలకే పంచిన దాఖలాలు కానీ ఉదాహరణలు కానీ ఏమయినా ఉన్నాయా ? మన జిల్లా విషయానికి వస్తే ఏమయినా ఒక్క ప్రాజెక్ట్ ను అయినా పూర్తి చేశారనో,ప్రారంభించారనో చెప్పగలరా.. చంద్రబాబు అభివృద్ధి అంతా గ్రాఫిక్స్ లోనే కనిపిస్తుంది. ఆయన అనుకూల మీడియా ఈటీవీ,ఏబీఎన్ ఆంధ్రజ్యోతి,టీవీ ఫైవ్ లోనే కనిపిస్తుంది. ఈ ఐదేళ్ల పాలనలో జగన్ మన ప్రాంతానికి ఏం చేశారో తెలుసా ? ఆయన ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి గ్రావిటీ ద్వారా సర్ఫేస్ వాటర్ అందించారు. శుద్ధ జలాలు అందించి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలిగించారు. ఓ వ్యాధి నిర్థారణ తరువాత చికిత్స కు సంబంధించిన ప్రక్రియలు రెండూ ఎంతో అవసరం అని గుర్తించి అదే ఉద్దానం ప్రాంతానికి పలాసలో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిని కట్టించారు. అత్యాధునిక సౌకర్యాలను,అత్యున్నత సాంకేతికతతో కూడిన ఎక్విప్మెంట్ ను ఈ ఆస్పత్రిలో కల్పించారు. అలానే జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ లో 900 బెడ్స్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఆరు అర్బన్ హెల్త్ సెంటర్లను తీసుకుని వచ్చారు. అలానే వైద్యంతో పాటే విద్యా రంగానికి సమున్నత ప్రాధాన్యం ఇచ్చారు. ఇవన్నీ మీరు గుర్తించాలి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. వీటి వెనుక ఉన్న ప్రధానోద్దేశం పేదల జీవన ప్రమాణాలను పెంచడమే. వారికి ఆధునిక విద్య,ఆధునిక వైద్యం ధనవంతులతో పోటీ పడే విధంగా అందించగలగడమే. పోటీ ప్రపంచంలో మన సర్కారు బడుల పిల్లలు రాణించగలిగే విధంగా చేయడమే. వీటి వెనుక ఉన్న ప్రధానోద్దేశం ఇదొక్కటే. మీరంతా వీటిని అర్థం చేసుకుని సంక్షేమ అభివృద్ధి రంగాలకు ఇచ్చిన ప్రాధాన్య రీతులను గుర్తించి.,ఇదే ఒరవడిని కొనసాగించేందుకు మళ్లీ వైయస్ జగన్ నే సీఎం చేయాలని కోరుకుంటున్నాను. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి తిలక్ కు, అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాకు ఓటు వెయ్యాలి అని మనవి చేస్తున్నాను. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను అని మంత్రి ప్రసాదరావు పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్ధి పెరాడ తిలక్, పట్టణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాధు వైకుంఠ రావు స్థానిక నాయకులు వరుదు విజయ్ కుమార్, వూడి సునీత, తోట తారక్, డాక్టర్ వూడి సంజన తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa