సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కంగనా రనౌత్.. తన దైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు కంగనపై విమర్శలు చేస్తుండగా.. ఆమె కూడా అదే రేంజ్‌లో హస్తం నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నారు. కంగనా రనౌత్ గో మాంసం తింటారని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా.. వాటిని ఆమె ఖండించారు. తాను హిందువునని.. బీఫ్ గానీ, ఇతర మాంసం కానీ ముట్టనని పేర్కొ్న్నారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా నెటిజన్లు మాత్రం కంగనను వదిలిపెట్టడం లేదు. ఆమె గతంలో చేసిన ఓ ట్వీట్‌ను బయటకు లాగి వైరల్ చేస్తున్నారు. దీంతో మరోసారి ఆమె అడ్డంగా దొరికిపోయారు.
కంగనా రనౌత్ ఆవు మాంసాన్ని తిన్నట్లు కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ నెల 5 వ తేదీన మహారాష్ట్రలో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన విజయ్ వాడెట్టివార్.. అవినీతి నాయకులందరికీ బీజేపీ స్వాగతం పలుకుతుందని ఆరోపించారు. అయితే విజయ్ వాడెట్టివార్ చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్ మండిపడ్డారు. తన ఆహార అలవాట్ల గురించి వస్తోన్న విమర్శలపై ఖండించిన కంగనా రనౌత్.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాను బీఫ్, రెడ్ మీట్ ఏదీ తిననని స్పష్టం చేశారు. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కొన్ని ఏళ్లుగా తాను యోగా, ఆయుర్వేద జీవన శైలిని ప్రచారం చేస్తున్నానని చెప్పారు. తన పరువుకు భంగం కలిగించేందుకు చేసే ఇలాంటి కుట్రలు పనిచేయవని తెలిపారు. తన నియోజకవర్గ ప్రజలకు తన గురించి తెలుసని.. ఇలాంటివి ఓటర్లను తప్పుదోవ పట్టించవని తెలిపారు. తాను గర్వించదగిన హిందువునని జై శ్రీరామ్ అంటూ పేర్కొన్నారు.
అయితే కంగనా రనౌత్ తాజాగా చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తాను గొడ్డు మాంసం తిననని ఇప్పుడు ట్వీట్ చేసిన కంగనా రనౌత్.. 2019 మే 19 వ తేదీన చేసిన ట్వీట్ అందుకు భిన్నంగా ఉండటంతో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. గో మాంసం తినడం తప్పుకాదని.. దానికి మతంతో సంబంధం లేదని గతంలో కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. దీంతో ఈ రెండు ట్వీట్లను పోల్చుతూ నెటిజన్లు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. మండి నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్ కేటాయించగా.. ఆ వెంటనే బీజేపీలో చేరినట్లు ఆమె ప్రకటించారు. ఇక ఇటీవలె భారత తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కంగనా రనౌత్ పేర్కొనడం తీవ్ర వివాదాస్పదం అయింది.