భీమవరానికి చెందిన బొంతు కిషోర్ కుమార్ (32), అతని భార్య యోచన, రెండేళ్ల కుమార్తె నిధిశ్రీ చించినాడ బ్రిడ్జి వద్ద గోదావరిలో దూకారని భర్త మృత దేహం లభ్యమైనట్టు ఎస్‌ఐ కె.శివన్నా రాయణ తెలిపారు. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కిషోర్ కుమార్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం కిషోర్ సోదరుడు ఉదయ కిరణ్ అతనికి ఫోన్ చేయగా ఎవరో ఫోన్ లిఫ్ట్ చేసి ఈ మొబైల్ చించి నాడ బ్రిడ్జిపై ఉందని, దీంతోపాటూ బ్యాగ్, చెప్పులు ఉన్నాయని చెప్పారు. దీంతో వెంటనే అతని బంధువులు బ్రిడ్జి వద్దకు చేరుకుని ఆ వస్తువులు కిషోర్‌కు చెందినవిగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిషోర్ కుటుంబం ఆచూకీ కోసం పోలీసులు గురువారం గోదావరిలో గాలించగా సాయంత్రం కిషోర్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. అతని భార్య, కుమార్తెల ఆచూకీ లభ్యం కాలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపి వేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఎస్‌ఐ తెలిపారు.శుక్రవారం ఉదయం గాలింపు కొనసాగిస్తామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.